తెలంగాణ

telangana

ETV Bharat / state

Organ Donation in Hyderabad : ఆరిపోతున్న జీవితాలకు 'ఆరో' ప్రాణమయ్యాడు - భద్రాద్రిలో అవయవ దానం

Organ Donation in Hyderabad : రోడ్డుప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ వ్యక్తి ఆరుగురికి అవయవదానం చేశారు. ప్రాణాపాయస్థితితో కొట్టుమిట్టాడుతున్న పలువురికి పునర్జన్మనిచ్చారు. ఆరిపోతున్న జీవితాలకు ఆరో ప్రాణమయ్యారు. బానోత్‌ శ్రీను నిర్జీవుడైనా ఆయన అవయవాలు కొందరికి ఊపిరిపోసి కొత్త జీవితాన్నిచ్చాయి. కుటుంబసభ్యుల సన్నద్ధత, నిపుణులైన వైద్యుల సత్వర స్పందన, ఆసుపత్రి యంత్రాంగం చేసిన చురుకైన ఏర్పాట్లు.. వెరసి బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి అవయవదాన ప్రక్రియ విజయవంతమైంది.

Organ Donation in Hyderabad
Organ Donation in Hyderabad

By

Published : Jan 27, 2022, 7:32 AM IST

Organ Donation in Hyderabad : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సమితిసింగారం పంచాయతీకి చెందిన బానోత్‌ శ్రీను(33) స్థానిక దుర్గ ఆఫ్‌లోడింగ్‌ కంపెనీలో విధులు నిర్వహించేవాడు. ఆయనకు భార్య పావని, కుమారుడు ఛత్రపతి, కుమార్తె నవ్యశ్రీ ఉన్నారు. శ్రీను ఈ నెల 22న విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా కూనవరం రైల్వేగేటు దగ్గర తన ద్విచక్రవాహనం ప్రమాదానికి గురవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు బుధవారం ఉదయం నిర్ధారించారు.

Organ Donation in Bhadradri : ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం అవయవ దానంపై శ్రీను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో అతని రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలు సేకరించి.. శస్త్ర చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. కన్న కొడుకు చనిపోయాడన్న బాధను దిగమింగుకొని ఆ తల్లిదండ్రులు తమ కొడుకు అవయవాలను ఇతరులకు దానం చేసిన వారి ఔన్నత్యాన్ని పలువురు అభినందించారు. తనతో ఏడడుగులు వేసిన భర్తకు చెందిన అవయవాలను ఆరుగురికి ఇచ్చేందుకు అంగీకరించిన పావని ఆత్మస్థైర్యాన్ని మెచ్చుకున్నారు.

ఓబీ కార్మికులు శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి, కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపి, సంతాపం ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details