తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టిన అరగంటకే పసికందు మాయం - బిడ్డ పుట్టిన అరగంటలో ఎత్తుకెళ్లిన దుండగులు

నిండు నెలల గర్భిణీ ప్రసవం కోసం ధర్మాసుపత్రిలో చేరింది. చేరిన కొంత సేపటికే పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డకు పాలు పట్టమని తల్లి చేతికిచ్చి సిబ్బంది బయటకెళ్లారు. తిరుగొచ్చి చూసేసరికి బిడ్డ మాయమైంది. పుట్టిన అరగంటలో బిడ్డమాయమవడం పలు అనుమానాలకు రేపుతుంది. సినీ ఫక్కీలో జరిగిన ఘటన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జరిగింది.

a baby missing in bhadrachalam government hospital
పుట్టిన అరగంటకే పసికందు మాయం

By

Published : Mar 10, 2020, 11:41 PM IST

పుట్టిన అరగంటకే పసికందు మాయం

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పసికందు మాయం ఘటన కలకలం రేపుతోంది. బాలింత కుటుంబీకులు... ఆస్పత్రి సిబ్బంది అందరూ ఉండగానే పట్టిన అరగంటలోనే పసికందు మాయమవడం చర్చనీయాంశంగా మారింది. తన పక్కలోంచే బిడ్డను ఓ మహిళ ఎత్తుకెళ్లిపోయిందని తల్లి చెబుతుండగా... అసలు ఆ బిడ్డ ఏమైందో అంతు చిక్కని సమస్యగా మారిందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.

అసలేం జరిగింది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మునకనపల్లికి చెందిన కాంతమ్మ ఐదోకాన్పు కోసం ఇవాళ ఉదయం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి వచ్చింది. ఆమెతో పాటు తల్లి, మరో బంధువు ఉన్నారు. ఆమెను పరీక్షించిన వైద్యులు సాధారణ కాన్పు అవుతుందని సూచించగా మధ్యాహ్నం ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

పాప పుట్టిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది బిడ్డను తల్లి పక్కన పడుకోబెట్టి వెళ్లిపోయారు. కాసేపటికి తేరుకున్న తల్లి తన పక్కలో బిడ్డ లేకపోవడం వల్ల ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులు కాన్పు విభాగంలోకి వచ్చి చూడగా బిడ్డ కనిపించలేదు. విషయం తెలియగానే సెలవులో ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యుగంధర్... హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. పసికందు తల్లి, బంధువులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు

ABOUT THE AUTHOR

...view details