ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌లో నిధులు పెద్ద ఎత్తు ఖర్చు చేస్తున్నారనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐదు లక్షల వ్యయం చేసే ఏ పనికైనా టెండర్ నిర్వహించాలనే నిబంధనలనూ యంత్రాంగం గాలికొదిలేసింది. అధికార, విపక్షాలకు చెందిన ఒకరిద్దరు నేతల ప్రమేయంతోనే నిధులను కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాల పునర్విభజన కంటే ముందే ఆదిలాబాద్ జిల్లా పరిషత్‌కు అన్ని హంగులతో సమావేశ మందిరం ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చునే వెసలుబాటు ఉండేది. పునర్విభజన తరువాత దాని ప్రాధాన్యత కాస్తంత తగ్గింది. గతేడాది డిసెంబర్ 11న జరిగిన సర్వసభ్య సమావేశం సందర్భంగా అద్దెకు తెచ్చిన విద్యుత్ బల్బులను అమర్చడం అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపా సభ్యుల మధ్య రాద్ధాంతానికి కారణమైంది. ఓ దశలో కాంగ్రెస్ సభ్యులపై అధికార తెరాస పోలీసు స్టేషన్‌లో అట్రాసిటి కేసు నమోదు చేసే దాకా వెళ్లింది. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సహా జిల్లా కీలకనేతలంతా జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణిగింది.
ఏకంగా 10 లక్షలు
తాజాగా ఈనెల 21న జడ్పీ సమావేశం అందులో కాకుండా మరోచోట నిర్వహించారు. సమావేశం ముగిశాక ఒకరిద్దరు అధికార, విపక్ష సభ్యుల ప్రమేయంతో పాత సమావేశ మందిరంలో విద్యుదీకరణ, ఏసీల వినియోగంతో పాటు పీఓపీ కోసం ఏకంగా 10 లక్షలు కేటాయిస్తూ ఆమోద ముద్రవేశారు. పైగా టెండర్ నిర్వహించకుండా అనుకూలమైన గుత్తేదారుకు ఒక్కో బిట్టు ఐదు లక్షల చొప్పున రెండు బిట్లుగా కేటాయించి ఇవ్వడం అధికారులు, నేతల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందానికి అద్దం పడుతోంది.