Which Party Will Win in Adilabad : గజరాతీల దాండియాలు, మార్వాడీల పండగలు, ఆదివాసీల గుస్సాడీ నృత్యాలు, లంబాడీల తీజ్ ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు ఆదిలాబాద్‌లో కనిపిస్తాయి. మొత్తానికి మినీ భారత్‌ను తలపించే ఆదిలాబాద్‌లో పైచేయి కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పది అసెంబ్లీ నియోజకవర్గాలతో ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad Assembly Constituencies)జిల్లా విస్తరించి ఉంది. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలు పెద్దపల్లి పరిధిలోకి వస్తే.. మిగిలిన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్(టి) నియోజకవర్గాలతో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం విస్తరించి ఉంది.
2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఆత్రం సక్కు విజయం సాధించగా.. పార్లమెంటు స్థానం పరిధిలోని మిగిలిన ఆరుస్థానాలతోపాటు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ స్థానాల్లో బీఆర్ఎస్నే విజయఢంకా మోగించి తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ఆ తరువాత 2019లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి(Telangana Parliament Election) పరిస్థితి తారుమారైంది. బీజేపీ తరపున పోటీచేసిన సోయం బాపురావు ఎంపీగా అనూహ్య విజయం సాధించారు. బీఆర్ఎస్ తరపున బరిలో దిగిన గోడం నగేశ్ ఓటమిపాలయ్యారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులకు నాందిపలికినట్లుగా మారింది.
BRS MLA Ticket Issue In Adilabad District : కారులో కుదుపులు.. ఇంతకీ వారి పయనం ఎటువైపో..!
Analysis on Adilabad Politics :జిల్లాలో 2018 శాసన సభ ఎన్నికలు, 2019లో పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయాల్లో మౌలిక మార్పు కనిపిస్తోంది. పైగా అప్పట్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయం సాధించిన బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రాఠోడ్ బాపురావు, రేఖానాయక్, ఆత్రం సక్కుకు టిక్కెట్లు దక్కలేదు. దాంతో రేఖానాయక్, రాఠోడ్ బాపురావు కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పట్లో కాంగ్రెస్ తరపున ఖానాపూర్ , నిర్మల్, ముథోల్ అభ్యర్థులుగా పోటీచేసిన రమేష్ రాఠోడ్ , మహేశ్వర్‌రెడ్డి, రామారావు పాటిల్ ఇప్పుడు అవే స్థానాల్లో బీజేపీ బరిలో నిలవడం మారిన రాజకీయాలకు సంకేతంగా నిలుస్తోంది.
Telangana Assembly Election 2023 :గత అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ బీజేపీ తరపున పోటీచేసిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవికి ఆపార్టీ టిక్కెట్టు నిరాకరించడం అసమ్మతిని రగిల్చింది. ఆమె బాధతో కమలం పార్టీని వీడారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అన్ని శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అసమ్మతి వెంటాడుతోంది. నాయకులు జెండాలు మార్చినట్లే.. అనుచరగణం వ్యక్తిగత ఆశలు పెంచుకోవడం రాజకీయపార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఫలితంగా నాయకులు సైతం అసమ్మతిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్పా.. జిల్లా సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. రాజకీయాలంటేనే ప్రజల్లోచులకన భావన ఏర్పడేలా చేస్తోందనే భావన కలుగుతోంది.