ఆదిలాబాద్ జిల్లాలో పొరుగుసేవల ఎంపిక నిర్వహణలో అధికారయంత్రాంగం ఆదినుంచి పక్షపాత ధోరణినే అవలంబిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగాల నిర్వహణ కోసం పొరుగుసేవల ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లా పాలనాధికారి ఛైర్మన్‌గా, ఉపాధికల్పనాధికారి మెంబర్ కన్వీనర్‌గా, కార్మికశాఖ అసిస్టెంట్ కమిష్‌నగర్, ఖజానాశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ పొరుగుసేవల సంస్థల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏజెన్సీలను ఎంపిక చేయాలి.
ఈ ఏడాది జూన్ 13న అధికారయంత్రాంగం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. అంతకుముందు ఉద్యోగాల నిర్వహణలో అనుభవం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌తోపాటు ఇన్‌కం టాక్స్ పత్రాలను పొందుపర్చాలని అందులో సూచించింది. టెండర్‌లో పాల్గొనే ఏజెన్సీలు 2017, 2018, 2019 సంవత్సరాల ప్రవర్తన ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది. జూన్ నెల 22వరకు షెడ్యూల్స్ స్వీకరించింది. మొత్తం 36 షెడ్యూల్స్ దాఖలయ్యాయి.
ఈ టెండర్ ప్రక్రియను అదేరోజు అదనపు పాలనాధికారి నేతృత్వంలో షెడ్యూల్స్ దాఖలు చేసిన ఏజెన్సీల నిర్వహకులు సమక్షంలోనే తెరిచి, అర్హత సాధించిన పొరుగుసేవల ఏజెన్సీల పేర్లు వెల్లడించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. సరైన పత్రాలు సమర్పించ లేదనే కారణంతో ఆరోజు రెండు షెడ్యూల్స్‌ను తిరస్కరించడంతో టెండర్ ప్రక్రియ ముగించారు. మిగిలిన 34 ఏజెన్సీలు అర్హత సాధించినట్లుగా పొరుగు సేవల నిర్వహకులు భావించారు. కానీ అధికారులు ఆ పేర్లు వెల్లడించలేదు. తరువాత జులై 27న కేవలం 17 పొరుగుసేవల ఏజెన్సీలే అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 22న వెల్లడించకుండా దాదాపుగా 25రోజుల అనంతరం జాబితా ప్రకటించడంలో అధికారులకు కలిసివచ్చిన అంశం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది.