Awareness Of Technical Education For RGUKT Students: మారుతున్న సమాజ పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాసరలోని ట్రిపుల్‌ఐటీ ముందుకెళ్తుంది. ఇటీవలే ఆర్జీయూకేటీని సందర్శించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఆర్జీయూకేటీలోనే టీహబ్ ఏర్పాటుకు భరోసా కల్పించిన కేటీఆర్.. వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ కంపెనీలతో ఒప్పందం జరిగేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
అందులో భాగంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ చేపట్టారు. ఇటీవలే వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు హైదరాబాద్‌లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణా పరిశోధన సంస్థ, టీహబ్ సహా 16 విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థలతో ఆర్జీయూకేటీ ఒప్పందం చేసుకుంది. హెచ్‌సీయూ, వరంగల్ ఎన్‌ఐటీతో ఎంవోయూ పూర్తైతే బాహ్య ప్రపంచంలో జరిగే నూతన ఆవిష్కరణల్లో ఆర్జీయూకేటీ విద్యార్థులతో పాటు అధ్యాపకులకు సముచితమైన స్థానం లభించే అవకాశం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివి.. మండల, జిల్లాస్థాయిల్లో ప్రతిభ కనపర్చిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో 2008లో ఆర్జీయూకేటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అడపా, దడపా విద్యార్థులు నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేసినా.. మిగిలిన విశ్వవిద్యాలయాలు, సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు లేకపోవడంతో అక్కడి విద్యార్థుల ఖ్యాతి బయటకు రాలేదు. ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్లు స్థానికంగా ఉండకుండా హైదరాబాద్ వంటి ప్రాంతాలకి పరిమితం కావడం విద్యార్థులకు శాపంగా మారింది. ప్రస్తుతం తమకు మంచిరోజులు వచ్చాయంటూ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.