తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్కెట్ యార్డులో రెండు క్వింటాళ్ల పంట మాయం... అధికారుల తీరుపై రైతుల ఆగ్ర‌హం

Theft takes place in Adilabad Market Yard : పంట అమ్ముకుందామని యార్డుకు వ‌చ్చాడా ఆ అన్నదాత. బస్తాలు తూకం వేసి.. మ‌రుస‌టి రోజు లోడ్ చేయాల‌ని అధికారులు చెప్పారు. ఆ రైతు బ‌స్తాలతో పాటే ఆ రాత్రి మార్కెట్​లోనే నిద్రపోయాడ్. తెల్లారి లోడ్ చేసే స‌మ‌యంలో 8 బ‌స్తాలు త‌గ్గాయి. తీరా అధికారులు విచారిస్తే దొంగ‌త‌నానికి గుర‌య్యాయ‌ని తేలింది. ఈ ఘటన ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో చోటుచేసుకుంది.

Adilabad Market Yard
Adilabad Market Yard

By

Published : Apr 6, 2023, 10:14 PM IST

Updated : Apr 7, 2023, 6:47 AM IST

మార్కెట్ యార్డులో రెండు క్వింటాళ్ల పంట మాయం... అధికారుల తీరుపై రైతుల ఆగ్ర‌హం

Theft in Adilabad Market Yard : బ్యాంకులో దాచుకున్న సొమ్ము దొంగల పాలు కాకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకు యాజ‌మాన్యానిదే. అలాగే వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వచ్చిన పంట ఉత్పత్తులను తూకం వేసి ఒక్క‌సారి బిల్లు చేశారంటే కొనుగోలు దారులదే దాని బాధ్యత. కానీ ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ప‌రిస్థితి భిన్నంగా ఉంది. పంట ఉత్ప‌త్తుల‌కు స‌రైన ర‌క్ష‌ణ లేక దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయి. చివ‌రికి రైతులే ఆర్థికంగా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది.

ఆదిలాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చే పంట ఉత్పత్తులకు భద్రత లేకుండా పోతోంది. ఇప్ప‌టికే పంట కొనుగోలు సమ‌యంలో వివిధ కార‌ణాల‌తో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నారు. తేమ పేరుతో పత్తిలో, నాణ్యత పేరుతో సోయలో, తరుగుపేరుతో శనగల కొనుగోళ్లలో అధికార యంత్రాంగం మెలికలు పెడుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా దొంగల బెడద అన్నదాతలను భయపెట్టిస్తోంది.

తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన దోర రాములు అనే రైతు 98 బస్తాలు శనగలను అమ్మ‌డానికి ఆదిలాబాద్ మార్కెట్‌ యార్డుకు బుధ‌వారం తీసుకొచ్చారు. వాటిని మార్క్ ఫెడ్ అధికారులు తూకం వేశారు. అనంత‌రం ఆ బ‌స్తాల‌ను లారీల్లో లోడ్ చేయాల్సి ఉంది. దీంతో ఆ రైతు త‌న 98 బ‌స్తాల‌తో పాటు మార్కెట్ లోనే ప‌డుకున్నారు. తెల్లారి య‌థావిధిగా శ‌నగ పంట బ‌స్తాల‌ను లారీల్లో లోడ్ చేస్తుంటే షాక్​కు గుర‌య్యే విష‌యం బ‌య‌ట ప‌డింది.

98 ఉండాల్సిన శ‌న‌గ బ‌స్తాల్లో 8 బ‌స్తాలు త‌గ్గినట్లు గుర్తించారు. దీంతో ఆ బాధిత రైతు మార్కెట్ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. విచారించిన వారు... అర్ధరాత్రి దాటాక రైతు నిద్ర‌పోవ‌డంతో గుర్తు తెలియని వ్యక్తులు 8 బస్తాల‌ను దొంగిలించిన‌ట్లు తెలుసుకున్నారు. ఆ బ‌స్తాల్లో రెండు క్వింటాళ్ల శ‌న‌గ‌లు ఉండ‌టం విశేషం. క్వింటాల్ కు రూ.5200 చొప్పున రెండు క్వింటాళ్లకు రూ. 10,400 నష్టపోతే ఎలా బతికేదీ అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రంతా భోజనం లేకుండా కాపలాకాస్తే లాభం రాక‌పోగా.. చివ‌రికి నష్టమే మిగిలిందని రాములు కన్నీరుమున్నీరయ్యారు. దీనికి తోడు సరకుకు తాము బాధ్యులం కాదు అని మార్క్‌ఫెడ్‌ సిబ్బంది పేర్కొనడం విమర్శలకు తావిస్తోంది. మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌ అధికారుల సమన్వయ లోపం వ‌ల్లే వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు రైతులు తీసుకొచ్చే పంట ఉత్పత్తులకు రక్షణ కరవవుతోంది. అయిదు, పది కిలోలు తక్కువైతే అన్నదాతలో పరిగణలోకి తీసుకోవడంలేదు. కానీ ఏకంగా రెండేసి క్వింటాళ్లు పంట ఉత్ప‌త్తులు దొంగతనాలు జ‌రుగుతున్నా.. అధికారులు తీరు వ‌ల్ల కర్షకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మున్ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టికైనా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు.

ఇవీ చదవండి:బీఆర్​ఎస్ చదువులు చెప్పిస్తుంటే.. బీజేపీ పేపర్ లీక్​లు చేస్తున్నారు: హరీశ్​రావు

ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్.. రూ.కోట్ల టర్నోవర్!

Last Updated : Apr 7, 2023, 6:47 AM IST

ABOUT THE AUTHOR

...view details