తెలంగాణ

telangana

ETV Bharat / state

Adilabad Dccb Scam: డీసీసీబీ కుంభకోణంలో కొత్త ట్విస్ట్.. మాటమార్చిన శ్రీపతి - Telangana news

Adilabad Dccb Scam: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు-డీసీసీబీ బేల బ్రాంచిలో వెలుగుచూసిన రూ. 2కోట్ల 85 లక్షల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది. ప్రధాన సూత్రదారైన స్టాఫ్ అసిస్టెంట్ కం క్యాషియర్ శ్రీపతికుమార్ మాటమార్చినట్లు తెలుస్తోంది. బ్యాంకు డబ్బులను దారి మళ్లించింది నిజమేనన్న ఆయన... తన నుంచి డబ్బులు తీసుకున్నవారు తిరిగి ఇవ్వలేదని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే సహఉద్యోగులు మాత్రం మొత్తం తిరిగి ఇచ్చేసినట్లు చెబుతున్నారు.

Dccb
Dccb

By

Published : Mar 17, 2022, 5:10 AM IST

Adilabad Dccb Scam: ఆదిలాబాద్‌ జిల్లా బేల, డోప్టాల ప్రాథమిక సహకార పరపతి సంఘాల ద్వారా... పంట రుణాల కోసం మంజూరు చేయాల్సిన రూ. 2కోట్ల 85లక్షల దుర్వినియోగం రాష్ట్ర సహకార వ్యవస్థలో సంచలనం సృష్టించింది. ఆలస్యంగా విచారణ మొదలుపెట్టిన యంత్రాంగం గత సెప్టెంబర్ 13 నుంచి ఈ ఫిబ్రవరి వరకు నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు తేల్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన సూత్రధారి శ్రీపతికుమార్ సహా బేల, జన్నారం, ఆదిలాబాద్ గ్రామీణం, భీంపూర్ పీఏసీఎస్‌ల్లోని 11 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. డీసీసీబీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈనెల 13న బేల పోలీసు స్టేషన్‌లో నమ్మక ద్రోహం, మోసం కింద కేసునమోదుకాగా ఈనెల 15నుంచి ప్రాథమిక విచారణ మొదలైంది.

దారి మళ్లించినట్లుగా...

అంతర్గతంగా శ్రీపతికుమార్‌ను విచారించగా డబ్బులు దారి మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కానీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోంచి... బ్యాంకు ఉద్యోగులు సహా ఇతరులకిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేదని పోలీసులకు వివరించారు. తనదే తప్పని... శ్రీపతికుమార్ అంగీకరిస్తే ఇతర ఉద్యోగులను విచారించాల్సిన అవసరం ఉండేదే కాదన్న అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. శ్రీపతికుమార్‌ ఆర్థిక నేరాన్ని అంగీకరించకపోవడంతో రెండురోజులుగా మిగిలిన ఉద్యోగుల విచారణ సాగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఉద్యోగుల విచారణ పూర్తయింది.

మరో ఐదుగురి విచారణ...

శ్రీపతికుమార్ నుంచి డబ్బులు తీసుకున్న సహఉద్యోగుల వాదన ఇంకో విధంగా ఉంది. అతని నుంచి చేబదులుగా, అవసరాలరీత్యా అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చినట్లు కొందరు ఉద్యోగులు బ్యాంకు ఖాతాలు, వ్యాలెట్లతో కూడిన పక్కా ఆధారాలను పోలీసులకు అందించారు. మరికొందరు నగదు రూపేణా చెల్లించామని చెప్పినట్లు సమాచారం. మరో ఐదుగురి విచారణ పూర్తైతే మళ్లీ శ్రీపతికుమార్‌ను విచారించే అవకాశం ఉంది.


ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details