తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆదిలాబాద్​లో తెరాస ర్యాలీ - new revenue act in Telangana

ఓ వైపు తెలంగాణ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలతో రైతుల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. మరోవైపు మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను తీసుకువస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఆదిలాబాద్​లో తెరాస శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

TRS rally in adilabad
ఆదిలాబాద్​లో తెరాస ర్యాలీ

By

Published : Sep 28, 2020, 4:42 PM IST

తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన వీధుల మీదుగా సాగింది.

జడ్పీ ఛైర్మన్‌ రాఠోడ్ జనార్దన్‌, మాజీ ఎంపీ నగేశ్​తో కలిసి కిసాన్‌ చౌక్​లోని రైతు విగ్రహంతో పాటు‌, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి... ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదిలాబాద్‌ నియోజక వర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో మూడు కిలోమీటర్ల మేర సాగిన ప్రదర్శనతో పట్టణం కోలాహాలంగా మారింది.

బ్యాంకుల్లో రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కుదవ పెట్టకుండానే రూ.లక్షా 60వేల రుణం పొందవచ్చన్న ఎమ్మెల్యే జోగు రామన్న.. కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details