ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గోడం నగేష్ గెలుపు బాధ్యతను తెరాస అధిష్ఠానం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అప్పగించింది. జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాఠోడ్ బాపూరావు, విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌లు గోడం నగేష్‌తో అంటీముట్టనట్లు ఉన్నారు. వీరి మధ్య సఖ్యతను కుదిర్చే బాధ్యతను ఇంద్రకరణ్‌రెడ్డికి తెరాస కట్టబెట్టింది.
నేతల్ని ముంచిన అతివిశ్వాసం...
కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్‌తో పాటు, భాజపా నుంచి ఆదివాసీ ఉద్యమనేత సోయం బాపూరావు బరిలో నిల్చారు. ఓట్లు చీలకుండా జాగ్రతలు తీసుకోవాలని పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేసింది. ఓ దశలో అంతర్గతంగా పార్టీ చేయించిన సర్వేల్లో కాంగ్రెస్, భాజాపా అభ్యర్థుల కంటే 7 నుంచి 9 శాతం అధికమైన ఓటింగ్ అనుకూలంగా ఉందనే అతివిశ్వాసం తెరాస నేతల్లో కనిపించింది. గెలుపు ధీమాతో ముందుకెళ్లిన తెరాస అధిష్ఠానానికి క్షేత్రస్థాయిలో వచ్చిన ఫలితం ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లయింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా తెరాస ఓ దశలో మూడోస్థానానికి దిగజారడం పార్టీ నేతలు ఖంగుతినాల్సి వచ్చింది.
మూడోస్థానానికి పరిమితమైన తెరాస...
భాజపా తరఫున బరిలో నిల్చిన ఆదివాసీ ఉద్యమనేత సోయం బాపురావు... తెరాస అభ్యర్థి గోడం నగేష్‌పై 58వేల 560 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ ముథోల్, బోథ్, ఆదిలాబాద్, నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో భాజపా స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. మొత్తం 23 రౌండ్ల ఓట్ల లెక్కింపులో దాదాపుగా 15వ రౌండ్ వరకు మొదటి రెండు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులే నిలవగా... తెరాస మూడోస్థానానికి పరిమితమైంది.