తెలంగాణ

telangana

ETV Bharat / state

మన్యంలో మృత్యుఘోష.. అసోదాలో ఆదివాసీల క'న్నీటి' వ్యథ - మిషన్‌ భగీరథ నీరు సరఫరా లేదు

కర్రలతో కట్టుకున్న పాకలే నేటికీ వారికి ఇంద్రభవనాలు. కొండల్లోని చెలమలే ఆ అభాగ్యుల దప్పిక తీర్చే నీటి ప్లాంట్లు. సుస్తీ చేస్తే వైద్యం ఉండదు.... ప్రాణం పోతే కారణం తెలియదు. ఇలా... అడవితో అల్లుకున్న ఆ బతుకులు... తరాలు మారినా నేటికీ వెలుగులు చూడటం లేదు. అనంతశోకంతో ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తూ... జీవన్మరణ సమస్యగా కాలం వెల్లదీస్తున్న గిరిజనగూడెంపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం...

Tribes drink polluted water and died at adilabad district
ఆ నీటిని తాగి మరణిస్తున్న ఆదివాసీలు!

By

Published : Feb 13, 2021, 7:07 AM IST

Updated : Feb 13, 2021, 7:12 AM IST

ఆ నీటిని తాగి మరణిస్తున్న ఆదివాసీలు!

తరతరాలుగా అడవి తల్లితో పెనవేసుకున్న బంధం. నిండైన అమాయకత్వం... కపటమెరుగని మనస్తత్వం. ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ... ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న ఈ గిరిపుత్రుల బతుకులు.... వెలుగు చూడకుండానే తెల్లారుతున్నాయి. ఈ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది... ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ ఆదివాసీ పల్లె. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే అసోదా గ్రామస్థులు... బాహ్యప్రపంచానికి తెలియని గోడును అనుభవిస్తున్నారు.

చికిత్స చేయించినా దక్కలేదు

చేతిలో చనిపోయిన భార్య ఫోటో పట్టుకుని బిడ్డల పక్కన ఆర్థ్రతతో కూర్చున్న ఇతని పేరు పర్చకి జ్యోతిరాం. ఇతని భార్య రత్తుబాయికి ఇటీవల ఉన్నట్టుండి తల, నరాల నొప్పితో అనారోగ్యానికి గురైంది. వెంటనే ఆమెను ఇంద్రవెల్లి మండలంలోని ఓ ఆర్​ఎంపీ వైద్యుని దగ్గర చికిత్స చేయించినా... ఫలితం దక్కలేదు. అదే రోజు అర్ధరాత్రి ఆమె చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలముకుంది. ఇదిలా ఉండగా... వంగిపోయిన నడుంతో నడవడమే కష్టంగా మారిన మరో యువతి దయనీయమిది. ఇలా... ఒక్కో కుటుంబానికి ఒక్కో దయనీయ గాథ... ఇక్కడి ఆదివాసీల జీవనవిధానానికి అద్దంపడుతోంది.

ఎలాంటి సౌకర్యాలు లేవు

దాదాపుగా ఏడు దశాబ్ధాల కిందటనే ఏర్పడిన అసోదా గ్రామంలో మొదట 40 కుటుంబాలు... 229 మంది జనాభాతో పక్కనున్న పిప్పల్‌ధరి పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు.. బుర్కి, పొన్నగూడ, బొప్పాపూర్‌ అనే అనుబంధ గ్రామాలు విలీనమై 559 మంది జనాభాతో నూతన పంచాయతీగా అవతరించింది. పంచాయతీగా ఏర్పడిందనే సంతోషమే కానీ ఎలాంటి మౌళిక సౌకర్యాలు ఈ గ్రామంలో సమకూరలేదు.

బావినీరే దాహం

ఇప్పటికీ పూరి గుడిసెల్లోనే ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. నమూనాగా నిర్మించిన నీటి ట్యాంకేగానీ అసోదకు ఇంకా మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. వాగు ఒడ్డున చెట్టుకింద ఉన్న బావినీరే దాహం తీరుస్తోంది. ఇటీవల గ్రామంలో రత్తుబాయి మరణించం, మరికొందరు అనారోగ్యానికి గురవడంతో కొందరు సిబ్బంది వచ్చి... బావిలో బ్లీచింగ్‌ వేసి వెళ్లారు.

పల్లె మొఖం చూడని అధికారులు

కొలమానం లేకుండా వేసిన బ్లీచింగ్‌తో చేపలు చచ్చిపోయి నీరు మరింత కలుషితమైంది. అయినప్పటికి తాగడానికి మరో గత్యంతరంలేక మోటార్లు పెట్టి పాత నీరును తోడేశారు. తప్పదు మరీ... గ్రామస్థుల దప్పిక తీరాలంటే ఈ బావి మాత్రమే ఆధారం. అడవిలో తామెన్ని కష్టాలు పడినా... గోడు పట్టించుకునే వారుండరని ఇక్కడి గిరిజనులు చెబుతున్నారు. గిరిజనుల సంక్షేమమే ప్రధానంగా ఎనభైయ్యో దశకంలో ఏర్పడిన ఉట్నూర్ ఐటీడీఏ చరిత్రలో.. ఇంతవరకు ప్రాజెక్టు అధికారులెవరూ ఈ పల్లె మొఖం చూడలేదు.

ఇదీ చూడండి :ఈతకు వెళ్లి ఇద్దరు స్నేహితులు మృతి

Last Updated : Feb 13, 2021, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details