Fight For Compensation: ఈయన పేరు కుర్సెంగ జలపతి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఘన్‌పూర్ పంచాయతీ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే చాప్రాల ఈయన స్వస్థలం. 2011 జనవరి 1న పొలంలో పనిచేస్తుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. జలపతి దాన్ని ప్రతిఘటించాడు. శక్తినంతా కూడగట్టుకొని గట్టిగా అరుస్తూ... ఎత్తి పడేశాడు. అరుపులు విన్న గూడెంవాసులు కర్రలతో కదలిరావడంతో ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది. కానీ, ఎలుగుబంటి దాడిలో జలపతి కుడికన్ను, ఎడమవైపు తలభాగానికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి దగ్గర ఉన్న 5వేల రూపాయలతో పాటు బంధువులు, గూడెం వాసులంతా డబ్బులు పోగు చేసి వైద్యానికి 15వేల రూపాయలు సాయం చేశారు.
అడవి జంతువులు దాడి చేస్తే ఎక్స్‌గ్రేషియా ఇస్తారని తెలుసుకుని... అప్పట్లోనే ఉట్నూర్ ఐటీడీఏ, అటవీశాఖకు జలపతి ఆర్జీ పెట్టుకున్నాడు. చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగాడు. రేపుమాపంటూ కాలం వెళ్లదీశారే తప్ప... నయాపైసా ఇవ్వలేదు. ఒకప్పుడు ఆరోగ్యంతో ఎలుగుబంటిని ఎదురించిన జలపతి... ఇప్పుడు అనారోగ్యంతో మంచం పట్టాల్సి వచ్చింది. అయినా అధికారులు కనికరించడం లేదు. కనీసం వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేయడంలేదని జలపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.