పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్యెల్సీ ఇవ్వడం వల్ల తెరాసకు కానీ, హుజురాబాద్‌కు కానీ ఒరిగేదేమీ లేదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి ద్వారా ఆరోపణలు చేయించి అవి కాంగ్రెస్ పార్టీ చేసినట్లుగా మార్చారని ధ్వజమెత్తారు. ఉద్యమంలో పనిచేసిన అనేక మందిని పక్కన పెట్టి కౌశిక్ రెడ్డికే ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు మల్లు రవి విజ్ఞప్తి చేశారు.
ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం, స్వయంపాలన కోసం ఉద్యమించిన రోజుగా భావిస్తామని మల్లు రవి అన్నారు. అందుకే ఆరోజు గిరిజన ఆత్మగౌరవ ప్రతీకగా ఇంద్రవెల్లిని భావించి అక్కడి నుంచి పోరాటం మొదలుపెడుతున్నట్లు వివరించారు. సెప్టెంబర్ 17 వరకు ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.