సహజసిద్ధమైన అటవీ సంపదకు పెట్టింది పేరైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జల్, జంగల్, జమీన్ పేరిట.. కుమురం భీం చేసిన పోరాటం తెలుగు గడ్డపై చెదరని సంతకమే. నిజాం పాలనపై తిరుగుబాటు బావుట ఎగరేసిన ఉద్యమమే. దండకారణ్యంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 1975 నుంచి 80 వరకు అప్పటి పటేల్, పట్వారీ వ్యవస్థ మరింత మితిమీరింది. విసిగిపోయిన గిరిజనం భూమి, భుక్తి, విముక్తి నినాదంతో.. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో నిర్వహించే సభ నిర్వహణకు నగారా మోగించింది. తొలుత సభ నిర్వహణకు అనుమతిచ్చిన అప్పటి పోలీసు యంత్రాంగం.. చివరి నిమిషంలో రద్దు చేసింది. విషయం తెలియని ఆదివాసీ జనం అప్పటికే ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, జైనూరు, కెరమెరి, తలమడుగు, తాంసీ ప్రాంతాల్లోని ప్రతి గూడెంలో తుడుం మోగించి.. ఇంద్రవెల్లి బాట పట్టింది. కాలినడకన, ఎద్దుల బండ్లపై.. ఇలా ఎవరికి తోచినరీతిలో వారు దండులా తరలిరావడంతో ఇంద్రవెల్లి గిరిజన సంద్రంగా మారింది. ఆరోజు ఇంద్రవెల్లి సంత కూడా ఉండడంతో జనం తాకిడి మరింత పెరిగింది.
గుళ్ల వర్షం కురిపించిన పోలీసులు..
సభలో గిరిజన మహిళపై ఓ కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించడం పరస్పరం వాగ్వాదానికి దారితీసింది. బాధిత మహిళ తన చేతిలో ఉన్న కొడవలితో కానిస్టేబుల్‌పై దాడి చేయగా ఆయన చనిపోయారు. అప్పటికే కాల్పుల కోసమే ఎదురుచూస్తున్న పోలీసులు.. మహిళ దాడితో ఒక్కసారి తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఎంతో మంది ఆదివాసీలు మృత్యువాతపడటంతో.. ఇంద్రవెల్లి మరో జలియన్‌వాలాబాగ్‌గా ప్రాచుర్యం పొందింది.