కే-4.. ఐదేళ్ల వయసున్న ఆడ పులి. మంచిర్యాల జిల్లా చెన్నూరు-నీల్వాయి అటవీ ప్రాంతంలో సంచరించే ఆ పులి ఇప్పుడు ఎక్కడ ఉంది? అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రెండు నెలలుగా దీని ఆచూకీ లభించట్లేదు. కెమెరాల కంటికి చిక్కట్లేదు. పాదముద్రలు దొరకట్లేదని తెలుస్తోంది. ఆపదలో చిక్కుకుందా? లేదంటే ఈ అటవీప్రాంతాన్ని వదిలేసి మరోచోటుకు పోయిందా అన్నదానిపై స్పష్టత లేదు.
ఆరేళ్లలో ఐదు పులుల మృతి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఆరేళ్ల వ్యవధిలోనే ఐదు పెద్దపులులు మరణించాయి. వేటగాళ్లు పెట్టిన కరెంటు ఉచ్చులో చిక్కుకుని అవి చనిపోయాయి. వాటి చర్మం ఒలిచి, గోర్లు తీసి విక్రయించే ప్రయత్నంలో ఒక ముఠా కూడా పట్టుబడింది. కే-4 ఆడ పులి కూడా గతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నా బయటపడింది. ఇనుపతీగ తుంటి భాగంలో ఉండటంతో ఆ గాయంతోనే కొన్నేళ్లుగా సంచరిస్తున్న పులి రెండు నెలలుగా కన్పించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై అటవీశాఖ అత్యంత గోప్పత పాటిస్తోంది. పెద్దపులుల సమాచారాన్ని అటవీ అధికారులు మీడియాకు వెల్లడించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కవ్వాల్‌కు వచ్చినవి ఎక్కడో?
కవ్వాల్ టైగర్ రిజర్వు ఏర్పాటుచేశాక.. ఇందులోని కోర్ ఏరియాకు ఆరేడు పులులు వచ్చాయి. అందులో ఒకటి కాగజ్‌నగర్ అటవీప్రాంతంలో ఉంది. మిగిలినవి మహారాష్ట్రకు వెళ్లాయా? ఎక్కడ ఉన్నాయన్నదానిపైనా స్పష్టతలేదు.