Insurance fraud in Asifabad: డబ్బుల కోసం ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి కొందరు రెడీగా ఉంటారు. కొందరేమో అయిన వాళ్లను మోసం చేసి డబ్బు సంపాదిస్తే.. మరికొందరు ఏకంగా బీమా డబ్బులు కోసం కుటుంబ సభ్యులను చంపేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బతికుండగానే.. అతడు చనిపోయినట్లు చిత్రీకరించి. .ఏకంగా అతడి పేరుపై మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి ఆ వ్యక్తి ఖాతాలో ఉన్న బీమా డబ్బులు దోచేసిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
సాధారణంగా బీమా డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. అన్ని నిబంధనలు సక్రమంగా పూర్తి చేయాలి. ముఖ్యంగా సదరు వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కావాలి. ఆ పత్రాన్ని ప్రభుత్వం అందిస్తుంది. మరణించిన వ్యక్తిపై ఉన్న బీమా డబ్బు తీసుకునే హక్కు కేవలం అతడికి నామినీగా ఉన్న వ్యక్తికి మాత్రమే ఉంటుంది. వేరే వారు ఆ డబ్బు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అలా జరగలేదు. వ్యక్తి బతికుండగానే అతడు మరణించినట్లుగా ధ్రువీకరణ పత్రం సృష్టించి అతడి బీమా డబ్బులు కొట్టేశాడు మరో వ్యక్తి. బాధితుడు తన ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం వెళ్లగా అతడి డబ్బు ఎవరో కాజేశారని తెలుసుకుని షాకయ్యాడు.