No Basic Facilities in villages : కనీస అవసరాలకు దూరంగా నేటికీ ఎన్నో పల్లెలు ఉన్నాయి. ఆస్పత్రి, మంచినీరు, మందులు ఇలా ఏం కావాలన్నా కూడా రాళ్ల మీది నుంచి నడవాల్సిందే. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రజలు నేటికీ కనీస సౌకర్యాలకు దూరంగా మగ్గిపోతున్నారు. రోడ్లు, తాగునీటి వసతికి సంబంధించిన ప్రతిపాదనలున్నా, అమలు కాకపోవడంతో ఏళ్ల తరబడి ప్రజలకు కష్టాలే మిగిలాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక పల్లెల ప్రజలు అభివృద్ధికి దూరంగా బతుకులు వెళ్లదీస్తున్నారు.
అంబులెన్సు కూడా వెళ్లని దుస్థితిలో..
గిరిజన గ్రామాల్లో దారులు బాగా లేక బస్సులొచ్చే ప్రశ్నే లేదు. ఆపద సమయంలోనైనా 108 అంబులెన్సు కూడా రాలేనంత దుర్భరంగా ఉన్నాయి రహదారులు. ప్రజలు ఎడ్లబండ్లను కిరాయికి తీసుకుని బాహ్యప్రపంచానికి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి. నిత్యావసరాలు, పంట విక్రయాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరకుల రవాణా..ఇలా అన్నిటికీ ఆ బండ్లే ఆధారం. గర్భిణులు వైద్య పరీక్షలు, ప్రసవానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. తండాలు, గిరిజన గూడేలను ప్రభుత్వం పంచాయతీలుగా మార్చాక కొంతమేరకు నిధుల వెసులుబాటు కలిగినా, రహదారులు, వంతెనల నిర్మాణం లాంటి శాశ్వత సమస్యలు పరిష్కరించాలంటే భారీగా నిధులు కావాలి. మారుమూల ప్రాంతాలు కావడంతో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవారు లేరని స్థానికులు చెబుతున్నారు.
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 425 గ్రామాలకు రహదారులు లేవు. ప్రధానంగా జైనూరు మండలంలో కిషన్‌నాయక్ తండా, చింతకర్ర, లొద్దిగూడ గ్రామాల ప్రజలు బండరాళ్ల రోడ్డులో ఎనిమిది కిలోమీటర్లు నడవాల్సిందే. నార్నూర్, సిర్పూర్ యు మండలంలోనూ ఇదే దుస్థితి. తిర్యాణి మండల కేంద్రం నుంచి 50 కి.మీ. దూరంలో ఉన్న ఎర్రబండ, తాటిగూడ, గీసిగూడ, గోబెర, సమతులగుండం గ్రామాల ప్రజలు ఏళ్ల తరబడి కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు.
* ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోనూ చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేవు. తాడ్వాయి మండలంలో బంధాల, నర్సాపురం, బొల్లేపల్లి గ్రామాలకు కనీసం రోడ్డు లేదు. వాజేడు మండలంలోనూ చాలా గ్రామాలది ఇదే దుస్థితి. కన్నాయిగూడెం, పలిమెల మండలాల్లోనూ మట్టిరోడ్లే ఉన్నాయి.
* కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం లింబారువాడికి రహదారి సౌకర్యం లేదు.