ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించటానికి లాక్‌డౌన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇతర అనారోగ్యాల బారిన పడ్డ బాధితులకు అవసరమైన సలహాలు, మందులను సూచించటానికి జిల్లా పాలనాధికారి ప్రారంభించిన ‘టెలీ మెడిసిన్’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పలువురు బాధితులు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే అక్కడుండే వైద్యులు వారికి అవసరమైన సూచనలు ఇవ్వటంతో పాటు మందులను సూచిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలో ప్రైవేటు ఆసుపత్రులు దాదాపుగా అన్నీ మూసే ఉన్నాయి. రిమ్స్‌లో కరోనా బాధితులు ఉంటారని అత్యవసరమైన వారు తప్ప సందర్శించటం లేదు. దీంతో ‘టెలీ మెడిసిన్’ బాధితులకెంతో ప్రయోజకరంగా మారింది.
ఆరోగ్య సమస్య వింటారు... మందులను సూచిస్తారు - teli medicine program in adilabad
కరోనా వైరస్ వ్యాప్తి నివారించడానికి రాష్ట్ర సర్కార్ లాక్‌డౌన్ విధించడం వల్ల అనారోగ్యాల బారిన పడ్డ బాధితులకు సాయం చేయడానికి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అనారోగ్యానికి గురైన వారికి సలహాలు, మందులు సూచించడానికి ప్రారంభించిన టెలీ మెడిసిన్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది.
ఆరోగ్య సమస్య వింటారు... మందులను సూచిస్తారు
ఇరవై నాలుగు గంటలు అందుబాటులో..
జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘టెలి మెడిసిన్’కు ప్రత్యేక ఫోన్ నెంబరు 08732 231850ను కేటాయించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యను వివరిస్తే అక్కడుండే వైద్యులు సరైన సూచనలు చేస్తారు. అవసరమైన మందులను సూచిస్తారు. ఈ కేంద్రంలో ఐఎంఎకు చెందిన ఒక వైద్యుడితో పాటు ఇద్దరు జూనియర్ వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ఇలా గత 17 రోజుల్లో 374 మంది ప్రయోజనం పొందారు.