Adilabad students stuck in Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడి విద్యార్థులు వైద్య విద్య కోసం అక్కడి వెళ్లడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఉద్ధృతమవుతోంది. నిన్న, మొన్నటి వరకు తమ పిల్లలతో ఫోన్లో మాట్లాడినవారికి.. ఇంటర్నెట్ సౌకర్యం తొలగించడంతో క్షేమ సమాచారం తెలుసుకోలేక.. మరింత ఆవేదనకు గురవుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వారిని "ఈటీవీ భారత్" పలకరించింది.
కన్నీటి పర్యంతం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ వీధికి చెందిన మునిపల్లి సాయికృష్ణ(27).. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు గతేడాది మార్చిలో ఉక్రెయిన్‌కు వెళ్లారు. సాయికృష్ణ ఉక్రెయిన్ రాజధాని.. కీవ్‌లో ఉంటూ ఎంఎస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంపై.. రష్యా యుద్ధానికి దిగడంతో సాయికృష్ణ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవతున్నామని వాపోయారు. 24 గంటలు మీడియా ఛానళ్లలో వార్తలు చూస్తూ గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కృష్ణ.. తమతో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడని, నిన్నటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి బాంబుల వర్షం కురుస్తోందని.. సాయి కృష్ణ ఉన్న ప్రాంతానికి వందమీటర్ల దూరంలో బాంబులు పడ్డాయని తెలిపినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు: యుద్ధభూమిపై విద్యార్థుల ఆవేదన
ఎప్పుడు ఏం జరుగుతుందోనని
సాయికృష్ణ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోనే బాంబులు పడుతున్నాయని.. అంతకుముందు సూపర్ మార్కెట్లో రెండుమూడు రోజులకు సరిపడే వస్తువులు తెచ్చుకున్నామని వివరించారు. ఇప్పటికే అన్నీ మూతపడ్డాయని ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగైనా తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఆదిలాబాద్ పట్టణం కైలాస్నగర్కి చెందిన ఎడమల నారాయణరెడ్డి- జయశ్రీ దంపతుల కూతురు ఎడమల నేత్రారెడ్డి, న్యూహౌజింగ్బోర్డుకాలనీకి చెందిన పోలిపెల్లి గజానన్-శారద దంపతుల కుమారుడు పోలిపెల్లి వంశీ కృష్ణ, వికలాంగుల కాలనీకి చెందిన బిశ్వాస్- మీర దంపతుల కుమారుడు మిరిన్మయ్ బిశ్వాస్ ఉక్రెయిన్‌లో ఆయా యూనివర్సిటీల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. యుద్ధం కారణంగా తమ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారిని వెంటనే భారత్‌కు రప్పించాలని కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీవీల ముందు కూర్చుని నిద్రాహారాలు మాని మనోవేదనకు గురవుతున్నారు.
ఆందోళనకు గురవుతున్నాం
"మా అబ్బాయి పోలిపెల్లి వంశీకృష్ణ.. ఉక్రెయిన్‌లో జపోర్ఝై స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ పట్టణం ఆ దేశ రాజధానికి 800 కి.మీ.ల దూరంలో ఉంది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో మేమంతా ఆందోళనకు గురవుతున్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో భయమేస్తోంది. మాట్లాడాలంటే ఫోన్లు కలవడం లేదు. ఎలాగైనా అక్కడి నుంచి మా అబ్బాయిని మన దేశానికి సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. తినడానికి సైతం ఏం దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలలో డబ్బు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వం వారిని క్షేమంగా స్వదేశానికి తరలించాలి." -పోలిపెల్లి గజానన్, ఎదులాపురం ఆదిలాబాద్ (కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీ)
సురక్షితంగా ఉన్నా
"మాది ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీ. నాన్న బిశ్వాస్, అమ్మ మీర. నేను ఉక్రెయిన్‌లోని వినిష్టియా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజే నాన్నతో వీడియో కాల్లో మాట్లాడా. బాగానే ఉన్నామని ధైర్యం చెప్పా. సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని మెడికల్ కళాశాల యాజమాన్యాన్ని మేమంతా కోరాం. ఈ పరిస్థితుల్లో కుదరదని వారంటున్నారు. బయట రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. భారత ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరుతున్నా." - మిరిన్మయ్ బిశ్వాస్