శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2018 డిసెంబర్ 11 కంటే ముందు ఉండే పంట రుణాలన్నింటిని మాఫీ చేస్తామని ప్రకటించింది. తాజాగా రూ.25 వేల లోపు పంట రుణం ఉన్న రైతులకు ఒకేసారి, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు విడతల వారీగా మాఫీ సొమ్ము అందిస్తామని సీఎం, మంత్రులు ప్రకటించడంతో పాటు నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.
రుణమాఫీకి సన్నద్ధం.. కర్షకుల్లో ఆనందం - Crop Loan Waiver Scheme funds released
రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లక్ష మందికి పైగా రైతులకు మాఫీ అయ్యే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేశారు. తొలివిడతలో రూ.25 వేల లోపు పంట రుణం తీసుకున్న రైతులను అర్హులుగా గుర్తించారు. వీరికి మాఫీ అందించే ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు.
ఆదిలాాబాద్ జిల్లా మొత్తంలో 1.33 లక్షల మంది రైతులు ఉంటే, వీరిలో 1.05 లక్షల మంది రుణాలు పొంది ఉంటారని అంచనా. గతంలో అప్పు ఉన్న రైతులకు రుణమాఫీ కింద విడతల వారీగా ఖాతాల్లో జమ చేశారు. వీటిని విడతల వారీగా జమ చేయడం, అవి ఏటా వడ్డీకి సరిపోతుండటం, పైగా ఇతర అప్పులు ఉంటే వాటి కింద రుణమాఫీ మొత్తాన్ని జమ చేసుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దఫా రైతులకు చెక్కులు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తొలివిడతలో రూ.25వేల లోపు పంట రుణం తీసుకున్న రైతులకు రుణ మొత్తం ఒకేసారి మాఫీ చేయనున్నారు. గతంలో పంట రుణం పొంది, తిరిగి చెల్లించకుండా ఉన్న బకాయిదారుల జాబితాలను సేకరించి అంతర్జాలంలో నమోదు చేస్తున్నారు.
- జిల్లాలో రైతులు 1.33 లక్షలు
- మాఫీ అయ్యే మొత్తం అంచనా రూ. 500 కోట్లు
- తొలివిడతలో గుర్తించిన అర్హులైన రైతులు 8601
- తొలి విడతలో మాఫీ అయ్యే మొత్తం రూ. 11.61 కోట్లు