Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ.. గెలుపు కోసం పార్టీలు పలు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలతో ప్రజల వద్దకు వెళ్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క ఛాన్స్ కోసం కొందరు.. మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Telangana Assembly Elections Polling 2023 :తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు.. సరిహద్దు రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరిగాయి. ఓవైపు ఆ రాష్ట్రానికి దట్టమైన అడవులతో పాటు.. మరోవైపు మావోయిస్టులు ప్రాబల్యమూ ఎక్కువే. అలాంటి తరుణంలో అక్కడి ఓటర్లు రాజ్యాంగం తమకు కల్పించిన ఓటు హక్కును వజ్రాయుధంగా చేసుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నంత నిర్బంధం ఇక్కడ లేకున్నా.. చదువుకున్న వారు, పట్టణ ప్రాంత వాసులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో ప్రజలు చూపిన తెగువ, అలాంటి స్ఫూర్తిని మనమూ చాటాలి. పట్టణ ప్రాంత వాసులు వీరి స్ఫూర్తితో వందశాతం దిశగా అడుగులు వేయాలి.
ఎన్నికలు వస్తున్నాయ్ బాస్ - పోస్టల్ ఓటు జాగ్రత్తగా వేయ్
గతం కారాదు పునరావృతం : తెలంగాణలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర సర్కార్ ఏటా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ర్యాలీలు, చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. తద్వారా ఫలితాలు కూడా బాగానే వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఓటింగ్ సరళి పెరిగినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో మాత్రం వెనుకంజలోనే ఉన్నారు. దగ్గరలోనే పోలింగ్ కేంద్రాలు, అన్ని సదుపాయాలు ఉండి విద్యావంతులు అయినప్పటికీ ఓటు వేయడంలో నిర్లిప్తత చోటుచేసుకుంటుంది.
పనులన్నీ వదులుకుని ఓటు వేయడం అవసరమా అనే ధోరణి ఇంకా కనిపిస్తోంది. ఒకటి రెండు ఓట్లతోనే ఫలితాలే తారు మారైన సంఘటనలు ఉన్నప్పటికీ ఓటు వేయడాన్ని చాలా మంది బాధ్యతగా గుర్తించడం లేదు.. ప్రతీ ఒక్కరు తమ బాధ్యతగా దీనిని గుర్తించిన నాడే మెజార్టీ ప్రజల నిర్ణయానికి అనుగుణంగా పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది.
గెలుపే మంత్రంగా.. లక్ష ఓట్లే టార్గెట్‌గా అభ్యర్థుల జపం
మంచిర్యాల జిల్లాలో : గత శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలో.. 78.72 శాతం పోలింగ్ నమోదైంది. కానీ పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం నమోదు కావడం గమనార్హం. మంచిర్యాల మండలంలో 68.26 శాతం, నస్పూర్‌లో 64.16 శాతం పోలింగ్ నమోదైంది.