ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో 3 నెలల క్రితం టీ హబ్ పేరిట వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 57 రకాల రక్త, మూత్ర నమూనాలకు పరీక్షలు చేసేలా అధునాత యంత్రాలను నెలకొల్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వేలల్లో పరీక్షలు చేసుకోలేని వారి కోసం.. ఉచితంగా పరీక్షలు చేయడమే ఈ కేంద్రం ముఖ్యోద్ధేశం.
జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్యా కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని.. ఐదు అర్బన్ హెల్త్ సెంటర్ల నుంచి వచ్చిన నమూనాలకు మాత్రమే ఇక్కడ పరీక్షలు చేసేందుకు అవకాశముంది. అయితే ఆరోగ్య శాఖలో పనిచేసే కొంతమంది ఉన్నతాధికారులు.. ఆరోగ్య సిబ్బంది, ప్రైవేటు నర్సింగ్‌హోంలలో పనిచేసే సిబ్బంది టీ హబ్ సేవలను నీరుగార్చేయత్నం చేస్తున్నారు. మారుమూల పీహెచ్‌సీల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేని వెసులుబాటును సాకుగా తీసుకుని.. టీ-హబ్ నిర్వాహకులే నేరుగా ప్రైవేటు వ్యక్తుల సాయంతో ఆయా పీహెచ్‌సీల నుంచి నమూనాలు సేకరించినట్లుగా నివేదికలు రూపొందించి పరీక్షలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే ఉన్నతాధికారి కుటుంబీకులకు సంబంధించిన రక్త నమూనాలను.. నేరుగా టీ - హబ్ కేంద్రానికి పంపించి పరీక్షలు చేయించడం ఆరోపణలకు బలాన్నిఇచ్చాయి. టీ - హబ్‌లో ఉచితంగా పరీక్షలు చేయించుకుని.. రోగుల నుంచి వేలల్లో డబ్బులు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.