'నిందితునిపై 302, 307, 324, ఆయుధాల చట్టానికి సంబంధించిన సెక్షన్లన్నీ ఉన్నాయి. అతనిపై లేనిదేముంది.. ఆయనకు బెయిల్ ఇవ్వమనడం తల్లిదండ్రులను చంపిన వ్యక్తే.. తాను అనాథ అన్నట్లు ఉంది' అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ (CJI Justice NV Ramana) వ్యాఖ్యానించారు.
CJI Justice NV Ramana: 'తల్లిదండ్రులను చంపి.. అనాథను అన్నట్లుంది' - MIM leader Farooq Ahmed bail petition news
ఎంఐఎం నేత ఫరూఖ్ అహ్మద్ (MIM leader Farooq Ahmed) బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ చేపట్టింది. ఆయనకు బెయిల్ ఇవ్వమనడం 'తల్లిదండ్రులను చంపిన వ్యక్తే.. తాను అనాథ అన్నట్లు ఉంది' అని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
గతేడాది డిసెంబరులో ఆదిలాబాద్‌లో తుపాకీతో కాల్పులు జరిపి ఒకరి మృతికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణమైన ఎంఐఎం నేత ఫరూఖ్ అహ్మద్ (MIM leader Farooq Ahmed) బెయిల్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టేసింది. నిందితుడు తొలుత బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను జూన్‌లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. వాటిని సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వి.కె.శుక్లా వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ జైలులో ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, భవిష్యత్తులో మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వైద్య చికిత్సలు అవసరమున్నాయని, బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలని ధర్మాసనానికి విన్నవించారు. ఈ దశలో సీజేఐ జోక్యం చేసుకుంటూ ‘‘పిటిషనర్ క్రూరంగా తుపాకితో కాల్పులు జరిపారు. అవతలి వ్యక్తుల కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. అయినా అనారోగ్య సమస్యలు చూపి బెయిల్ కోరడం సమంజసంగా లేదని’’ వ్యాఖ్యానించారు. బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాలన్న న్యాయవాది శుక్లా అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.