students Suicides in iiit basara RGUKT : నిర్మల్ జిల్లా బాసర ఆర్జేకేయూటీలో విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం విద్యార్థిని దీపిక బాత్రుంలో చున్నీతో ఉరేసుకుని మృతి చెందగా.. తాజాగా తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖిత అనే మరో విద్యార్థిని భవనంపై నుంచి పడి మరణించింది.
వరుసగా రెండు రోజుల్లో.. రెండు మరణాలు... ఒకరిది ఆత్మహత్యగా అధికారులు నిర్ధారణ చేయగా.. మరొకరిది భవనం పైనుంచి పడిన ప్రమాదంగా తేల్చారు. ముందుగా ఆత్మహత్య అంటూ అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు సైతం.. తర్వాత మాట మార్చారు. మా పాపకు జరిగింది ప్రమాదమే అని చెబుతున్నారు. లిఖిత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించగా.. స్వస్థలం గజ్వేల్‌కు తరలించారు.
బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. విచారణ తర్వాతే పూర్తి నిజానిజాలు వెలుగులోకి వస్తాయని డీసీపీ జీవన్‌రెడ్డి చెబుతున్నారు. మరోవైపు ప్రమాదం జరిగితేనే అలాంటి గాయాలు ఉంటాయంటూ లిఖిత మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యుడు అంటున్నారు.
ట్రిపుల్- ఐటీలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదని దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. దీనికి సంబంధిత శాఖ మంత్రి, అధికారులు తప్పకుండా బాధ్యత వహించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.