ఆదిలాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ తరగతులను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు టీ-శాట్ విద్య, దూరదర్శన్(యాదగిరి) ఛానల్‌ల ద్వారా ఆయా తరగతులకు అందజేసిన సమయసారిణి ప్రకారం పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నాయి. కొంతమందికి సొంత టీవీలు లేకపోవడం, ఉన్న వారికి డిష్ సౌకర్యం లేక అవరోధంగా మారింది. మారుమూల ప్రాంతాల్లో కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే వస్తోంది. దీంతో టీ-శాట్‌లో ప్రసారమయ్యే పాఠాలను విద్యార్థులు వీక్షించలేకపోతున్నారు.
విద్యార్థులకు పంపిణీ చేయడం కోసం అధికారులు అభ్యాసనపత్రాలు(వర్క్‌షీట్లు) సిద్ధం చేశారు. కానీ వీటిని ప్రింట్ తీసి ఒక్కో పాఠశాలకు అందించాలంటే సుమారు రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. దీంతో విద్యార్థుల వాట్సాప్ గ్రూపులకు పంపిస్తున్నారు. కొన్ని చోట్లనే విద్యార్థులకు ప్రింట్ కాపీలు పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు విద్యుత్తు అంతరాయం విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది. ఆదిలాబాద్ గ్రామీణం, భీంపూర్, తాంసి, తలమడుగు, సిరికొండ, జైనథ్, బేల, నేరడిగొండ తదితర అన్ని మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది. ఇలా ఆయా సమస్యలను అధిగమిస్తే.. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు సులువుగా మారేందుకు ఆస్కారం ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది.
డిష్ టీవీల్లో 6, 7వ తరగతుల పాఠాలు ప్రసారం కావడం లేదు. ఇది గమనించిన తాంసి(కె) ఉపాధ్యాయులు చరవాణి ద్వారా పాఠాలు వినేలా చూస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యాసన పత్రాలు(వర్క్‌షీట్లు) అందజేసి పాఠాలు చదివిస్తున్నారు.
భీంపూర్ మండలం అర్లి(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలోని విద్యార్థులు విద్యుత్తు అంతరాయంతో టీవీలు వీక్షించలేకపోతున్నారు. దీంతో అక్కడి ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని వారి ఇళ్లకు వెళ్లి చరవాణులు వినియోగించేలా చూస్తున్నారు. పాఠశాలకు సమీపంలోని శాంతినగర్ గిరిజన గూడెంలో చరవాణి సౌకర్యం లేని విద్యార్థులకు ఉపాధ్యాయులు చరవాణిలో పాఠాలు వినిపిస్తున్నారు.