తెలంగాణ

telangana

ETV Bharat / state

డిజిటల్‌ దిశగా వీధి వ్యాపారుల అడుగులు.. - street vendors digital transactions

వీధి వ్యాపారులు డిజిటల్‌ లావాదేవీలవైపు మళ్లించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్వహణపై వారికి అవగాహన కల్పించి, నగదు రహిత చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. విడతల వారీగా శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నాలుగు విడతల్లో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

street vendors digital transactions
వీధి వ్యాపారుల డిజిటల్ లావాదేవీలు

By

Published : Oct 30, 2020, 1:07 PM IST

ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రస్తుతం వీధి వ్యాపారుల గుర్తింపుతో పాటు వారికి ప్రధానమంత్రి స్వానిధి పథకం ద్వారా రుణాలు అందిస్తున్నారు. ఆర్థికంగా వారిని ఆదుకోవడమే కాకుండా కొత్తగా డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించేలా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రుణాలు పొందిన వ్యాపారులకు ఈ నెల 27, 29, 31వ తేదీల్లో విడతల వారీగా శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. యూనిక్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌లను సిద్ధం చేసి వివిధ పేపెంట్‌ యాప్‌ల ద్వారా నగదురహిత లావాదేవీ నిర్వహించే విధానం గురించి వివరించనున్నారు. ఇలా చేస్తే తీసుకున్న రుణంలో నెలకు రూ.100 క్యాష్‌బ్యాక్‌ వచ్చే అవకాశం ఉండటంతో వ్యాపారులకు ప్రయోజనం కలగనుంది.

ప్రస్తుతం తీసుకున్న వారికి ఈ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు రుణం మంజూరు కాని వారికి ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. బ్యాంకు అధికారుల సమక్షంలో మాట్లాడి, రుణం మంజూరు ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టనున్నారు. తీసుకున్న వారి కంటే రుణం మంజూరు కాకుండా మిగిలిపోయిన వారే అధికంగా ఉన్నారు. రాయితీ రుణాలు కాకపోవడంతో కొందరు వ్యాపారులు తీసుకునేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. చాలా మంది రుణాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నా.. వివిధ లోపాల కారణంగా మంజూరులో ఆలస్యమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పట్టణంలో గుర్తించిన వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి డిజిటల్‌ లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రుణ మంజూరులో జాప్యం వంటి సమస్యలు కూడా పరిష్కారమవుతాయని మెప్మా డీఎంసీ సుభాష్ పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఈయన పేరు వెంకటి. వినాయక్‌చౌక్‌లో టీ దుకాణం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వీధి వ్యాపారులకు అందజేస్తున్న రూ.10 వేల రుణాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం నెలనెలా వాయిదాలు చెల్లిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ చేసుకొని డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఈయన తీసుకున్న రుణంలో ప్రతి నెలా రూ.100 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇలా పట్టణంలోని వీధి వ్యాపారులందరూ డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించేలా పుర అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

పట్టణంలో గుర్తించిన వీధి వ్యాపారులు - 8525

రుణం మంజూరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసిన వారు - 7272

ఇప్పటి వరకు రుణాలు పొందిన వారు - 3772

ABOUT THE AUTHOR

...view details