నాగోబా జాతర... మెస్రం వంశీయుల జీవితాలతో ముడిపడి ఉన్న ప్రధాన పండుగ. వారి ఆచార వ్యవహారాలకు తలమానిక. జాతరకు ఎడ్ల బళ్లపై తరలిరావడం... మర్రిచెట్టు నీడన సేద తీరడం... మట్టి కుండల్లో తెచ్చే గంగాజలంతో ఆలయాన్ని అభిషేకించడం ఈ జాతర ప్రత్యేకత. నియమ, నిష్టలే ప్రామాణికంగా... నాగోబాను ఆరాధించడం ఇక్కడి ప్రధాన ఆచారం. నాగోబా సన్నిధిలో భేటింగ్ పేరిట మొక్కు తీర్చుకుంటేనే... పెళ్లైన మహిళలకు మెస్రం వంశీయుల కోడలిగా గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ కర్మకాండ చేస్తేనే కాలం చేసినవారికి యోగం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే... నాగోబా జాతర అంటే మెస్రం వంశస్తుల బతుకుచిత్రం. జనన, మరణాల సంఘమం. పెళ్లి పేరంటాల సంబురాల వేదిక. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి గిరిజనలు ఈ జాతరకు వస్తారు.
నాగోబా జాతర కథ
ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం... పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లోని మేనమామ ఇంటికి వస్తారట. కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సాయం చేయనందున కోపంతో తన తండ్రిని చంపడానికే వస్తున్నారని ఆయన కూతురు ఇంద్రాదేవి భావిస్తుంది. ఆమె పెద్దపులిగా మారి ఏడుగురు అన్నదమ్మల్లో ఆరుగురిని చంపేస్తుంది. ఆఖరివాడు నాగేంద్రుడిని వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్‌కు చేరుకుంటాడు. తనను కాపాడిన నాగేంద్రుడిని గ్రామంలోనే కొలువుదీరాలని మెస్రం వంశీయులు వేడుకోవడంతో ఆయన వెలుస్తాడు. అప్పటి నుంచి నాగోబా దేవత జాతరగా ప్రసిద్ధి పొందిందనేది మెస్రం వంశీయుల నమ్మకం. వారి దైనందిన జీవితంలో నాగోబా దేవుడిది చెదరని సంతకం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా నాగోబా జాతరలో కలుసుకోవాలనేది ఆనవాయితీ. ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి మహాపూజతో జాతర క్రతృవు ప్రారంభమవుతుంది. అంతకంటే నెలరోజుల ముందునుంచే మెస్రం వంశీయుల నియమ నిష్టల ప్రస్థానం మొదలవుతుంది.
జాతర విశిష్టత...
జాతర ప్రారంభానికి ముందు పుష్య పౌర్ణమి రోజున మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ పూజలకు అవసరమయ్యే మట్టి కుండల్ని కూడా తరతరాలుగా ఒకే వంశస్థులు చేయడం ఆచారంగా వస్తోంది. తర్వాత మెస్రం వంశస్థులు వారం రోజులపాటు జాతర ప్రచారం నిర్వహించి గంగాజలం కోసం కేస్లాపూర్ నుంచి బయలుదేరుతారు. కాలినడకన 125 కి.మీ దూరం ప్రయాణించి జన్నారం మండలం కలమడుగు గ్రామసమీపంలోని హస్తినమడుగులోని నీటిని ఓ కలశంలో నింపుకుని తీసుకొచ్చి గ్రామ శివారులోని మర్రిచెట్ల కింద బసచేస్తారు. మర్రిచెట్టునీడన అందరూ కలిసి నాగోబాకు సమర్పించే నైవేద్యం కూడా గట్కా, సాంబారే. అక్కడే మెస్రం వంశీయుల్లోని 22 తెగల్లో మృతిచెందిన పితృదేవతలకు తూం(కర్మకాండ) పూజలు నిర్వహిస్తారు. అనంతరం డోలు, సన్నాయిలు వాయిస్తూ నాగోబా ఆలయానికి బయలుదేరతారు.