ఎన్నాళ్లీ ప్రసవ వేదన.. పాలకులు పట్టించుకోరా..? ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఆదివాసీలు దశాబ్దాలుగా కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సరైన రహదారి సౌకర్యం లేక.. వాహనాలు రాలేక అవస్థలు పడుతున్నారు. ప్రసవ సమయంలో గర్భిణీల వేదన అరణ్య రోదనగా మారుతోంది. తల్లీ, బిడ్డల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యం అందితే.. పునర్జన్మ ఎత్తినట్లే..
కొండకోనల్లో జీవనం సాగించే ఆదివాసీల సమస్యలు అన్నీఇన్నీ కావు. ఏ చిన్న సమస్య వచ్చినా దగ్గర్లోని పట్టణాలకు వెళ్లాల్సిందే. అందుకోసం కాలినడకే మార్గం. ఇటీవల కొంతమేరకు మట్టిరోడ్లపై ఆటోలు.. ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నా.. వర్షాకాలంలో వాగులు వంకలు దాటడం ప్రాణ సంకటంగా మారుతోంది. అనారోగ్య, ఇతర సమస్యలకు అత్యవసరంగా వైద్యం అందాలంటే పునర్జన్మ ఎత్తినట్లుగానే భావించాల్సి వస్తోంది.
గర్భిణీలకు ప్రాణ సంకటం..
రక్తహీనత, పోషకాహార లోపం తదితర సమస్యలు గిరిజనులను వెంటాడుతుండగా.. వాటిని అధిగమించి జీవితం నెట్టుకొస్తున్నారు. ప్రధానంగా గర్భిణీలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. రహదారులపైనే ప్రసవం.. కన్ను తెరవక ముందే మృత్యువాత పడుతున్న శిశువుల ఘటనలు ఆదివాసీల కష్టాలకు అద్దం పడుతున్నాయి. అడుగు ముందుకు వేయలేని చందంగా వాగులు, అధ్వాన్నమైన దారులు మన్యంలో తల్లీబిడ్డల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.
రోడ్డుపైనే ప్రసవం.. మృత శిశివు జననం
కుమురం భీం పురిటిగడ్డ రౌట సంకెపల్లిలో జరిగిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గర్భిణీ గజ్జెల రాణికి శుక్రవారం ఉదయం రక్తస్రావమైంది. ఏఎన్ఎంకు సమాచారం ఇవ్వగా.. ఆమె 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వాహనం గ్రామానికి రాలేని పరిస్థితి. గర్భిణీని తీసుకొని ఆమె భర్త రెండు కిలోమీటర్ల గతుకులు, బురద మార్గంలో ఎడ్లబండిపై ప్రయాణించి ఆర్ఆర్ కాలనీకి చేరుకున్నారు. కౌటల నుంచి అంబులెన్స్ 60 కిలోమీటర్లు దాటి రాగా.. అప్పటికే తీవ్ర ఆలస్యమవగా గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించింది. మృత శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం రాణిని ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు.
కుమురం భీం జన్మస్థలంలోనే ఇలా..
ఆదివాసీ హక్కుల కోసం అమరుడైన భీం జన్మస్థలం రౌట సంకెపల్లి గ్రామానికి ఇప్పటికీ రహదారి సౌకర్యం లేదు. రెండు చోట్ల ఎదురయ్యే వాగులు గిరిజనులకు అడ్డుపడుతున్నాయి. జైనూర్ మండలం చింతకర్ర గ్రామానికి చెందిన పవార్ రేఖ బాయిని గతనెల 23న కుటుంబసభ్యులు ఎత్తుకొని వాగు దాటించారు. ఈ గ్రామానికి వెళ్లేందుకు ఆరు కిలోమీటర్ల మేర రహదారి లేదు. బెజ్జూర్ మండలంలోని సోమినీకి చెందిన శంకరమ్మకు గత ఏడాది పురిటి నొప్పులు వచ్చాయి. మెడ వరకు నీటిలోనే గర్భిణీని కుటుంబ సభ్యులు వాగు దాటించారు. అనంతరం ఆటోలో 6 కిలోమీటర్ల దూరంలో బెజ్జూర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే శంకరమ్మ ఆటోలోనే ప్రసవించారు.
కనీస రహదారి సౌకర్యం లేదు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 27 మండలాల్లో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 542 గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం లేదు. వాగు అవతల ఉన్నవాళ్లు వర్షాకాలం అంతా వనవాసం చేయక తప్పడం లేదు. ఏటా జులై నుంచి డిసెంబర్ వరకు ఈ మూడు జిల్లాల్లోని గిరిజన ప్రాంత గర్భిణీలు ప్రసవ సమయాల్లో అనేక గండాలు ఎదుర్కొంటున్నారు. 2018లో 21 మంది గర్భిణీలు, 333 శిశువులు ప్రాణాలు కోల్పోయారు. 2019లో 27 మంది గర్భిణీలు.. 101 మంది శిశువులు బలయ్యారు. తాజాగా జరిగిన ఘోరంతోనైనా అధికారులు, పాలకులు స్పందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. తాము నివాసం ఉండే ప్రాంతాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఫ్లోరోసిస్‌ను మించిన వ్యాధి.. దయనీయ స్థితిలో వందలాది మంది