తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకుచిత్రం: కష్టాల కడలిలో ఈదుతున్న మంగీలీ ప్రజలు - adilabad district latest news

చుట్టూ అటవీ ప్రాంతం... చెట్ల మధ్య గుడిసెలు... కష్టాలకు దగ్గరగా అభివృద్ధికి దూరంగా బతుకుతున్న అక్కడి ప్రజలు. బడి, ఆస్పత్రి అనేది వారి కలకు దూరమైన పదాలు. ఓట్లు వేసినా అమలుకాని ప్రభుత్వ పథకాలు. అసలు అది ఓ ఊరు అని పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. రెండు దశబ్దాలుగా మౌనరోదన అనుభవిస్తున్న ఆ ఆదివాసీ పల్లె గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

mangili village
కష్టాల కడలిలో ఈదుతున్న మంగీలీ ప్రజలు

By

Published : Apr 2, 2021, 12:30 PM IST

కష్టాల కడలిలో ఈదుతున్న మంగీలీ ప్రజలు

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే వాన్‌వట్‌ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మంగీలీ గ్రామం... రెండు దశబ్దాల కింద ఏర్పడిన ఆదివాసీ పల్లె. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వానవట్‌ వరకు దాదాపుగా 15 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో గుట్టల మధ్య ఉండే రాళ్ల మార్గంలో వెళ్తే మంగీలీ వస్తుంది. గ్రామం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ ప్రభుత్వ నీటి పథకాలేవీ పనిచేయవు. బడి సౌకర్యం లేక ఇక్కడి చిన్నారులు నిరాక్షరాస్యులుగానే మిగిలిపోతున్నారు. గర్భిణీలకు కనీస ప్రాథమిక వైద్యం అందుబాటులో లేదు. రోడ్డు లేకపోవడం వల్ల అంబులెన్సు సౌకర్యమూ లేదు. ఫలితంగా ఇక్కడి గర్భిణీలకు ఇళ్లలోనే పురుడుపోసే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.

నీటి కోసం రాళ్లబాటలో నడక

తాగునీటి కోసం మంగీలీవాసుల గోస వర్ణణాతీతం. ఆ పల్లె ప్రజలు దాహం తీర్చుకోవాలంటే... ఊరి పక్కనున్న గుట్ట దిగి... బండరాళ్ల నుంచి జాలువారే జలధారని ఒడిసిపట్టుకోవాల్సిందే. మిషన్‌ భగీరథ పథకం నమూనాగా మిగిలిపోయింది తప్పా... చుక్కనీరు రాల్చడంలేదు. వర్షకాలమైతే బాహ్యప్రపంచంతో సంబంధమే ఉండదు. వందలోపు జనాభా కలిగిన ఇక్కడి ఆదివాసీలది వ్యవసాయమే జీవనాధారం. ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేకపోగా... ఇక్కడ ఏర్పాటుచేసిన సోలార్‌ వ్యవస్థ కూడా పనిచేయడంలేదు.

అభివృద్ధికి ఆమడదూరంలో

అంతా ఆదివాసీలే కావడంతో అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడరు. ఆధార్‌కార్డులోని లెక్కల ప్రకారం అరవై ఏళ్లుదాటినవారు ఉన్నప్పటికీ పింఛన్‌ రావడంలేదు. అడవిలో లభించే కర్రలతో నిర్మించుకున్న గుడిసెలే తప్పా... పక్కా ఇళ్ల జాడే కనిపించదు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వాలు కేటాయించే నిధులు నీళ్లలా ఖర్చువుతుంటే... మంగీలీ వంటి గ్రామాల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.

అందని ద్రాక్షగా విద్య, వైద్యం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిన ఉట్నూర్‌ ఐటీడీఏ... ఆదివాసీ పల్లెల బాగోగులను విస్మరిస్తోందనే ఆరోపణలను మూటగట్టుకుంటోంది. మారుమూళ్ల పల్లెల్లో తాగునీరు, విద్య, వైద్యం అందించలేనిదిగా మిగిలిపోతోంది.

ABOUT THE AUTHOR

...view details