ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా విద్యుత్తు సంస్థలో టెండర్ దక్కించుకున్న గుత్తేదారుతో పాటు విద్యుత్తు సిబ్బంది రొటేషన్ పద్ధతిలో వినియోగదారుల బిల్లింగ్ లెక్కింపు చేస్తున్నారు. విద్యుత్తు సిబ్బంది ఆధ్వర్యంలో 33 శాతం సర్వీసు మీటర్ల బిల్లింగ్ చేస్తే గుత్తేదారు ఆధ్వర్యంలో 67 శాతం బిల్లింగ్ చేయాల్సి ఉంది. జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధివిధానాలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బిల్లింగ్‌లో తప్పులు దొర్లి వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
గృహవసరాలకు వినియోగించే విద్యుత్తు వాడకమంతా కేటగిరి-1 కిందికి వస్తుంది. వాణిజ్యపరమై విద్యుత్తు వినియోగం కేటగిరి-2 కిందికి వస్తుంది. కేటగిరికి -1 పరిధిలోనే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు గృహవసరాల కోసం 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు నెలలకోసారి, పట్టణ ప్రాంతాల్లో నెలకోసారి బిల్లింగ్ జరుగుతోంది. ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు బిల్లింగ్ ప్రక్రియను ఆపివేయాల్సి ఉంటుంది. మానవ తప్పదాలు తలెత్తకుండా మీటర్ రీడింగ్ తీయాలంటే ఇన్‌ఫ్రా రెడ్ డాటా ఎనలైసిస్(ఐఆర్‌డీఏ) పద్ధతిని అమలుచేస్తే మీటర్ ముందు రీడింగ్ పరికరాన్ని ఉంచితే అదే బిల్లు ఇస్తుంది. దీనికనుగుణంగా పూర్తిస్థాయిలో మీటర్లు లేనందున తప్పనిసరిగా సిబ్బంది రీడింగ్ రాసుకోవాల్సి వస్తోంది. దాంతో చాలా సందర్భాల్లో తప్పులతడకగా అధిక బిల్లులు రావడంతో వినియోగదారులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఒకే నెలలో రూ.29,838 బిల్లు వచ్చిందని పేర్కొంటున్న ఈ యువకుడిది ఆదిలాబాద్ గ్రామీణ మండలం జందాపూర్. సహజంగా ఎస్సీ కేటగిరి కింద పరిగణనలోకి తీసుకుంటే వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగం వెసులుబాటు ఉంది. ఆ అంశాన్ని మినహాయించినా నెలకు సగటు రూ.190 నుంచి రూ.300 లోపు బిల్లు వస్తుంది. సంస్థకు ఎలాంటి పాత బకాయి లేడని విద్యుత్తు శాఖ పంపిణీ చేసిన బిల్లులోనూ ఉంది. ఆగస్టు నెలకు ఏకంగా 3,410 యూనిట్ల విద్యుత్తు వాడినట్లుగా లెక్కించి రూ.29,838 చెల్లించాలని బిల్లు ఇవ్వడంతో కంగుతిన్నారు. వాణిజ్యపరంగా విద్యుత్తుని వినియోగించినా ఇంత బిల్లురాదనే ఆయన ఆవేదనను క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు పట్టించుకోవడం లేదు.