తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2022, 7:12 AM IST

ETV Bharat / state

టెట్ పరీక్ష రాయాలంటే పక్క జిల్లా వెళ్లాల్సిందే

TET Exam in Telangana : ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అభ్యర్థులంతా ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టారు. దరఖాస్తుల స్వీకరణా షురూ అయింది. కానీ.. పరీక్షా కేంద్రాలకు నిర్దేశించిన సంఖ్యకు మించి దరఖాస్తులు రావడం వల్ల చాలా మంది పొరుగు జిల్లాలకు వెళ్లి రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ జిల్లా దూరంగా ఉంటే.. పరీక్ష కంటే ఒక రోజు ముందే అక్కడికి వెళ్లాలి. ఇది పేద అభ్యర్థులకు కాస్త ఆర్థిక భారమే. పరీక్షా కేంద్రాలు పెంచి తమ జిల్లాలోనే టెట్ రాసేలా వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు.

TET Exam in Telangana
TET Exam in Telangana

TET Exam in Telangana : కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసే అభ్యర్థులకు తిప్పలు తప్పేలా లేవు. కేంద్రాలకు నిర్దేశించుకున్న సంఖ్యకు మించి దరఖాస్తులు రావటంతో పలువురు పొరుగు జిల్లాలకు వెళ్లి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 12తో గడువు ముగియనుంది. నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో తమ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలు కనిపించకపోవడంతో పొరుగు జిల్లాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. మీ జిల్లా కనిపించకపోతే.. ఆయా పరీక్షా కేంద్రాల కెపాసిటీ ముగిసినట్లుగా భావించి మరో జిల్లాను కేంద్రంగా ఎంచుకోవాలని వెబ్‌సైట్లో సూచన కనిపిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, ములుగు, జగిత్యాల జిల్లాల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అంటే ఇకపై ఆయా ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకునేవారు పొరుగు జిల్లాలను ఎంచుకోవాల్సిందే. మరికొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి రానుందని భావిస్తున్నారు. ఈసారి పేపర్‌-1కు డీఈడీతోపాటు బీఈడీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఆ పరీక్ష ఉదయమే ప్రారంభం అవుతుంది. అంటే ప్రయాణ దూరాన్ని బట్టి ఒకరోజు ముందే ఆయా జిల్లాలకు వెళ్లాలి. అది పేద అభ్యర్థులకు ఆర్థిక భారం కానుంది. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలు పెంచి ఎక్కడి వారు అక్కడే పరీక్ష రాసే వెసులుబాటును కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

TET Exam in Telangana 2022 : ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం తరోడ గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు మేస్రం ఈశ్వర్‌. నెట్ సెంటర్‌కు వెళ్లి టెట్ కోసం దరఖాస్తు చేస్తే సొంత జిల్లా పేరు ఆన్‌లైన్‌లో కనిపించలేదు. పొరుగు జిల్లా నిర్మల్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని దరఖాస్తు పత్రాన్ని చూపిస్తున్నాడు. ఉదయం పూట జరిగే పేపర్‌-1 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో ఒకరోజు ముందే నిర్మల్‌కు వెళ్లాల్సి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details