తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎద్దులకూ ఓ పండుగ ఉంది... ఎక్కడ చేస్తారో తెలుసా! - పొలాల అమావాస్య

సంక్రాంతి, దసర, దీపావళి పండుగలు అందరికీ తెలుసు. కానీ ఎద్దులకో పండుగ ఉంటుందనేది అతికొద్ది మందికే తెలుసు. ఏడాదికోసారి పుట్టింటిబిడ్డల చేతులతో కృతజ్ఞతగా ఎద్దులకు నైవేద్యం తినిపించే ఈ వేడుక కోసం ఊరువాడ ఆశగా ఎదురుచూస్తుంది. మహారాష్ట్రలో పొలా సంప్రదాయంగా నిర్వహించే వేడుక సరిహద్దున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పొలాల పేరిట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పొలాల అమావాస్య విశేషాలు తెలుసుకుందాం.

polala amavasya
polala amavasya

By

Published : Sep 6, 2021, 7:52 AM IST

Updated : Sep 6, 2021, 11:06 PM IST

ఎద్దులకూ ఓ పండుగ ఉంది... ఎక్కడ చేస్తారో తెలుసా!

వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చినప్పటికీ ఎద్దుల పాత్ర విడదీయలేనిదే. వేసవి దుక్కులతో ప్రారంభమయ్యే ఖరీఫ్‌ కాలంలో రైతునేస్తంగా ఎద్దు.. మొద్దు కష్టం చేస్తుంది. రైతులు ప్రధానంగా ప్రకృతి ఆరాధకులు. ఎద్దులను శివపార్వతుల పుత్రులైన నందీశ్వరులుగా, వానను వరుణ దేవుడిగా, భూమిని నేలతల్లిని భావించే రైతులది వసుదైక కుటుంబం. అందుకని పంటల సాగుకు అనుకూలించే ఏ విషయాన్ని కూడా మరిచిపోరు. పశుపక్షాదుల, కాలమానాలను సైతం దేవతారూపంగా ఆరాధించి సంబురాలు నిర్వహించుకునే సంప్రదాయం అనాధిగా వస్తోంది. ఇందులో ప్రధానఘట్టమే పొలాల పండుగ.

పండుగలోని పరమార్థం ఇదే..

ప్రాశస్థంలో ఉన్న కథ ప్రకారం పొలాల పండుగకు శివపార్వతులకు అవినాభావ సంబంధం ఉంది. పుత్ర వాత్సల్యం ఇమిడి ఉంది. పుత్రులైన ఎద్దులను చూడాలని పార్వతీదేవీ తరుచూ శివుడిపై ఒత్తిడి చేస్తుంది. కానీ ఏడాదంతా రైతులతో సమానంగా కష్టపడే ఎద్దులను చూపిస్తే ఆమె మనసు బాధపడుతుందనే కారణంతో శివుడు రేపు మాపంటూ వాయిదా వేస్తూ వస్తాడు. శ్రావణ మాసం ముగింపుతో ఖరీఫ్‌ పనులకు దాదాపుగా తెరపడుతుంది. అందుకే శ్రావణ అమావాస్యరోజుకంటే ఒకరోజు ఎద్దులతో ఎలాంటి పనులు చేయించరు. రాత్రిపూట ఎద్దుల మెడ, మూపురంపై ప్రేమతో పసుపురాసి, డబ్బగడ్డితో ఏం దించుతవ్‌... బరువులు దించుతా అంటూ ప్రేమను చాటుతూ కడుపునిండా పచ్చని గడ్డిని వేస్తారు.

ప్రత్యేకంగా అలంకరిస్తారు

మరుసటి రోజు ఉదయం ఎలాంటి పనిచేయించకుండా మేతకు తీసుకెళ్తారు. అనంతరం ప్రతి ఎద్దును శుభ్రంగా కడుగుతారు. తరువాత కొమ్ములకు రంగురంగుల కాగితాలు, ప్రత్యేకంగా తయారుచేసే కుచ్చులు, మెడలో గంటలు, కాళ్లకు గజ్జలు... ఒంటిపై కొత్తగా చేయించిన జూళ్లుతో అలంకరిస్తారు. ఊరంతా ఒక్కసారిగా పార్వతీ పతి హరహర మహాదేవా... శంభోశంకర అంటూ నినాదాలు చేస్తూ ముందుగా గ్రామదేవతల ఆలయాల చుట్టూ తిప్పుతూ ఊరిచివరన ఒకచోట గుంపుగా చేరుస్తారు. అక్కడ గ్రామ పెద్ద ప్రతి ఎద్దును పసుపు, కుంకుమ, బిల్వపత్రాలతో ప్రత్యేకంగా పూజిస్తారు. తర్వాత డప్పులు, భాజభజంత్రీలతో ఊరేగిస్తూ గ్రామ హనుమాన్‌ ఆలయం చుట్టూ తిప్పుతారు.

పార్వతీదేవి చూస్తుందని...

అక్కడి నుంచి ఎవరింటికి వారి ఎద్దులను తీసుకెళ్లి పుట్టింటి బిడ్డ మంగళ హారతిపట్టగా గ్రామదేవత బొట్టును ఎద్దుల నొసటిపై పెట్టి షడ్రుచులతో చేసిన నైవేద్యాలను తినిపిస్తారు. తరువాత పంచామృతంతో కాళ్లను శుభ్రంగా కడిగేసి తాంబూళాలు తినిపించి నందీశ్వరా నీకు దండాలంటూ ఇంటిళ్లిపాది కాళ్లకుమొక్కుతారు. అనంతరం ఎద్దుల కష్టానికి వచ్చే ఆదాయానికి చిహ్నంగా వాటిపై నుంచి తమకు తోచినంతా డబ్బును తిప్పేసి ఆడకూతురు, పాలేరుకు సమర్పించి తిరిగి కట్టేస్తారు. ఆధ్యంతం ఈ ఘట్టాన్ని తిలకించే పార్వతీదేవి తన పిల్లలు ప్రతిరోజూ ఇలా పూజలు అందుకుంటాయని సంబురపడుతుందనేది పండుగలోని పరామర్థంగా ప్రాచూర్యంలో ఉంది.

ఇంటింట సంబురం

పొలాల పండగ వస్తుందంటే చాలు నెలరోజుల ముందునుంచే ప్రతి ఇంటా సంబురం నెలకొంటుంది. ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కరూ పొలాల రోజు ఇంటికి రావాలనేది నియమం. పెళ్లయి అత్తారింటికి వెళ్లిన కూతుళ్లను తీసుకురావడం, ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కోవడం, ఇళ్లకు సున్నం వేయించుకోవడం, పరిసరాలను శుభ్రం చేసుకోవడం ఈ పండుగలో పాటించే నియమాలు. అమావాస్య రోజు ఉపవాసం ఉండి, ఎద్దులకు నైవేద్య వితరణ అనంతరం పాలేర్లు, కుటుంబ సభ్యులంతా కలిసి బూరెలతో కూడిన సహపంక్తి భోజనం చేయడం ఆనవాయితీ. సంక్రాంతి, దసరా, దీపావళి వేడుకలకంటే భిన్నంగా ఎద్దుల పండుగను ఎంత ఘనంగా నిర్వహిస్తే శివపార్వతులు అంత ఆనందపడి అదేస్థాయిలో వరాలు కురిపిస్తారనేది రైతుల అచంచల విశ్వాసం.

శ్రమైక జీవన సౌందర్యం

'పొలాల పండుగ శ్రమజీవన సౌందర్యానికి నిదర్శనమైన గొప్ప వేడుక. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వ్యవసాయదారులే కాదు. వ్యవసాయేతరులు సైతం పండుగ రోజున రైతుల ఎద్దులను ఇళ్లకు తీసుకెళ్లి నైవేద్యాలు తినిపించే గొప్ప సంస్కృతి ఉంది. వాటిని తమ పిల్లలకంటే ఎక్కువగా ప్రేమగా చూస్తారు. వ్యవసాయంలో ఆధునిక పనిముట్ల వాడకం పెరుగుతున్నప్పటికీ పొలాల పండుగను నిర్వహించుకుంటున్నారు. అక్షరాస్యత, నిరక్షరాస్యత ప్రమేయం లేకుండా పండుగను అందరూ నిష్టగా చేసుకుంటున్నారు.'

-సామల రాజవర్ధన్, విశ్రాంత తెలుగు పండితులు

ఇదీ చదవండి :'పిల్లలే పుట్టరన్నారు.. అందుకే తనంటే చాలా ఇష్టం'

Last Updated : Sep 6, 2021, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details