ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత సాగయ్యే ప్రధాన పంట సోయా. నియంత్రిత సాగులోనూ జిల్లాలో ఇవే పంటలు సాగు చేసుకోవచ్చని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంకేముంది తెలిసిన పంటలే కదా...! అని అనుకున్న రైతుల సంతోషం కొద్ది రోజులకే పరిమితమైంది. పత్తి పంటకు బదులు సోయా విస్తీర్ణం పెంచుదామనుకున్న అన్నదాతలకు విత్తన లేమి నిరాశకు గురిచేస్తోంది. జిల్లాలో రాయితీ విత్తనాలు లభించక... ప్రైవేటు కంపెనీలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. విత్తేందుకు సమయం సమీపిస్తుండటం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సరిపడా విత్తనాలు రాక అధికారులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం ఆయా వ్యవసాయ కార్యాలయాలకు.. రైతులు వచ్చిపోతున్నా సమాధానాలు చెప్పట్లేదని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం... సాగుకు నెలాఖరు వరకు సమయం ఉందని... అంతగా అవసరమైతే మార్కెట్లో లభ్యమయ్యే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు.
"ఆదిలాబాద్ జిల్లాకు గాను 27 వేల 934 క్వింటాళ్ల విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఈ విత్తనాలు వేసుకోడానికి జూన్ 30 వరకు సమయం ఉంది. అయితే ఇప్పటికే మనకు 3 వేల 300 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు తరలించడం జరిగింది."
-ఆశాకుమారి జిల్లా వ్యవసాయాధికారి