హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ జాతీయ రహదారిని పారిశ్రామిక కారిడార్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న కారిడార్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. జిల్లాలో 20 వేలకుపైగా నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తే అభివృద్ధితోపాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని సభాముఖంగా విన్నవించారు. అనంతరం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు సైతం లేఖను అందజేశారు. తాజాగా యంత్రాంగం ఆ దిశగా అడుగులు ఆరంభించడం జిల్లాకు కలిసి రానుంది.
కొత్త పరిశ్రమలకు ఊతం.. స్థలాల ఎంపికకు సర్కార్ ఆదేశం - ఆదిలాబాద్ జిల్లాలో కొత్త పరిశ్రమలు
కొత్త పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కసరత్తు ఆరంభించింది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల కోసం అనువైన స్థలాలు ఎంపిక చేయాలని ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో ఎమ్మెల్యే జోగురామన్న అసెంబ్లీలో చేసిన విన్నపం మేరకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ నుంచి జిల్లా పాలనాధికారి కార్యాలయానికి ఉత్తర్వులు పంపించడంతో కొత్త ఆశలు చిగురించాయి.
![కొత్త పరిశ్రమలకు ఊతం.. స్థలాల ఎంపికకు సర్కార్ ఆదేశం selection-of-suitable-places-for-industries-in-adilabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9520428-506-9520428-1605168778581.jpg)
జిల్లాలో నేరడిగొండ నుంచి పెన్‌గంగా నది వరకు దాదాపు 70 కిలోమీటర్ల వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి పొడవు ఉంటుంది. ఈ రహదారి పక్కల పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పించనున్నారు. సరకు రవాణా కోసం నాలుగు వరుసల రహదారి ఉండడం, రైలు మార్గం ఉపయోగపడడం పరిశ్రమల స్థాపనకు కలిసి రానుంది.
జిల్లాలో అనువుగా ఉన్న సిమెంటు, కాగితపు, వస్త్ర పరిశ్రమలతోపాటు ఇతర అందుబాటులో ఉన్న ముడిసరుకు ఆధారంగా ఏఏ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చనే దిశగా ఆలోచన చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనికోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలతోపాటు ప్రైవేటు స్థలాల వివరాలు సేకరించనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరలు ఏవిధంగా ఉన్నాయి, మార్కెట్‌లో భూముల ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకోనున్నారు. రహదారి పొడవునా ఇరు పక్కల స్థలాలను పరిశీలించనున్నారు. రహదారి మధ్యలో ఏజెన్సీ ఏరియా, అటవీశాఖ భూములు సైతం ఉండడంతో ఆ వివరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాలో ప్రభుత్వ పరంగా లభించే రాయితీలతో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడడం శుభపరిణామం.