తెలంగాణ

telangana

ETV Bharat / state

Sand Mafia in adilabad: పెన్‌గంగలో జోరుగా ఇసుక దందా.. వారధి నిర్మించి అక్రమ రవాణా - Sand Mafia in adilabad

Sand Mafia in adilabad:తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ నదిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఏకంగా నది మధ్యలో వారధి నిర్మించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అక్రమార్కుల చర్యలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Sand Mafia in adilabad
Sand Mafia in adilabad

By

Published : May 12, 2022, 5:00 AM IST

Updated : May 12, 2022, 5:37 AM IST

Sand Mafia in adilabad: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌ మండలం తాంసి-కే, జైనథ్‌ మండలం కోర్ట గ్రామ సరిహద్దులోని పెన్‌గంగా నది పరివాహక ప్రాంతమిది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చనకా-కోర్ట బ్యారేజీ పంప్‌హౌజ్‌కు అతి సమీపంలో అనుబంధ పిప్పల్‌కోటి జలాశయ నిర్మాణానికి దగ్గరగా నది ప్రవహిస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. జిల్లాలో గృహ నిర్మాణాలు, ఇతర పనుల కోసం ఇసుకకు భారీ డిమాండ్‌ ఉండటంతో నదిపై అక్రమార్కుల కన్ను పడింది. బ్యారేజీ నిర్మాణాల పేరుతో అక్రమ ఇసుక దందాకు తెరలేపారు. ఏకంగా నది మధ్యలో వారధి నిర్మించి ఇసుక రవాణాకు రాచమార్గంగా మార్చుకున్నారు. జేసీబీలతో పగలు, రాత్రిళ్లు ఇసుక తోడి ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికులు అడ్డు చెప్పకుండా ఆయా గ్రామాలకు చెందిన ట్రాక్టర్లను వినియోగిస్తూ వారికి కొంత ముట్టజెబుతున్నారు. నది వరకు వెళ్లేందుకు ప్రత్యేకంగా ఐదు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించుకోవడం అక్రమార్కుల దందాకు పరాకాష్టగా నిలుస్తోంది.

పెన్‌గంగలో జోరుగా ఇసుక దందా.. వారధి నిర్మించి అక్రమ రవాణా

పెన్‌గంగా పరివాహక ప్రాంతంలోని గుబిడి, అంతర్గాం, వడూర్‌, తాంసి-కే, కోర్ట, ఆనంద్‌పూర్‌, డొల్లారా, సాంగ్వి గ్రామాల సరిహద్దుల్లో ఇసుక దందా నడుస్తోంది. వాస్తవానికి వేలం వేసే ఇసుక నిల్వలు ఇక్కడ లేవని అధికారులు చెబుతున్నా దందాను అడ్డుకునేందుకు సాహసించడం లేదు. అనుమతి లేదనే విషయం చెప్పాలని భూగర్భ గనులశాఖ అధికారి రవిశంకర్‌ని ఈటీవీ భారత్ సంప్రదిస్తే ఆయన మాట్లాడేందుకు కూడా నిరాకరించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాభివృద్ధి కమిటీలు అనధికారికంగా వేలం వేస్తున్నా ఆ గ్రామాలకు ముట్టే డబ్బుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ఇసుక అక్రమ రవాణాతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ దందా వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పర్యావరణ పరిరక్షణ కోసం ఇసుక అక్రమ రవాణాను మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవాల్సిన అవసరముందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : May 12, 2022, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details