Adilabad telangana Grameena bank issue : ఆదిలాబాద్ బస్టాండు సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.1.28 కోట్లు స్వాహా అయిన వైనం కలకలం రేపింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీలోని సల్పలగూడకు చెందిన ముగ్గురు రైతుల ఖాతాల్లో రూ.1,28,78,000 అనుకోకుండా జమ అయ్యింది. నగదు ఉపసంహరణ కూడా జరిగిపోయింది. ఈ విషయం హెడ్ ఆఫీస్ వారు చెబితే కానీ స్థానిక బ్యాంకు వారికి తెలియలేదు. ఈ నగదు ఉపసంహరణలో మామిడిగూడ సీఎస్‌పీ (కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు జె.రమేష్ పాత్ర ఉన్నట్లు బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎం.వివేక్ తెలిపారు.
సల్పలగూడకు చెందిన కొడప భీంరావు రూ.5.20 లక్షలు, మడావి రాంబాయి రూ.9.50 లక్షలు, కొడప గంగాదేవి రూ.1.50 లక్షలు మొత్తంగా రూ.16.20 లక్షలు సీఎస్‌పీ నిర్వాహకుని సాయంతో క్రెడిట్ కార్డుతో డ్రా చేశారు. ఈ క్రెడిట్ కార్డులో ఒక రైతుకు గరిష్ఠంగా రెండు లక్షల వరకు పరిమితి ఉంటుంది. ఒక రోజుకు రూ.60 వేలు మాత్రమే డ్రా చేయాలి. వారి ఖాతాల్లో రూ.కోటికి పైగా జమ అయిందని తెలుసుకున్న సీఎస్‌పీ నిర్వాహకుడు రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులను తన వద్ద ఉంచుకుని నాలుగు నెలలుగా డ్రా చేస్తూ వచ్చాడు. అయితే శుక్రవారం రికవరీకి వెళ్లిన అధికారులకు సీఎస్‌పీ నిర్వాహకుడితో పాటు రైతులు తిరిగి చెల్లిస్తామని రాత పూర్వక హామీ ఇవ్వడంతో పోలీసు కేసు నమోదు చేయలేదు.