కొవిడ్ భయంతో ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల ప్రైవేటు ఆసుపత్రులు సేవలందించడం లేదు. ప్రధానంగా ప్రసవాలు చేయటానికి సైతం ప్రైవేటులో వైద్యులు ఆసక్తి చూపటం లేదు. కొన్ని నర్సింగ్ హోంలలో కాన్పులు చేస్తున్నా... భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ కాన్పు చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు, శస్త్ర చికిత్స కాన్పులకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బిల్లు వేస్తున్నారు. దీంతో ఎక్కువ మంది కాన్పుల కోసం రిమ్స్ ఆసుపత్రినే ఆశ్రయిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 20 నుంచి 30 వరకు ఇక్కడ కాన్పులవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని రిమ్స్ ప్రసవ విభాగంలో సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రసవ విభాగంలో విధుల కోసం పైరవీలు
ప్రసవ విభాగంలో విధులు నిర్వహించటానికి కొందరు సిబ్బంది రాజకీయ ప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఇలాగే అక్రమాలకు పాల్పడిన వారిని ఆ వార్డు నుంచి తొలగిస్తే వారు ప్రజాప్రతినిధులను ఆశ్రయించి రిమ్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్లీ అదే వార్డులో విధులు కేటాయించుకునేలా చేశారని తన పేరు వెల్లడించని ఒక వైద్యుడు పేర్కొన్నారు. మరికొందరు యూనియన్‌లను ఆశ్రయించి ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు.
రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
బండారు నరేందర్, ఆర్‌ఎంఓ
రిమ్స్‌లో చికిత్సలు చేయించుకోవటానికి వచ్చిన వారు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే పర్యవేక్షకునికి లేదా ఆర్‌ఎంఓకు నేరుగా ఫిర్యాదు చేయాలి. డబ్బులు అడిగిన సిబ్బందిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వ్యవహారం పునరావృతం కాకుండా చూస్తాం.
చేతిలో రూ. 50 ఉంటేనే డ్రెస్సింగ్..
చేతిలో రూ.50 నోటుతో కూర్చున్న ఈ బాలింత చిచ్‌ధరి ఖానాపూర్‌కు చెందిన సునీత. శస్త్ర చికిత్స ప్రసవం అయి ఆరు రోజులైంది. శస్త్ర చికిత్స చేసిన చోట డ్రెస్సింగ్ మార్చుకోవాలంటే ఇలా చేతిలో నోటుతో గదిలోకి వెళితేనే సిబ్బంది డ్రెస్సింగ్ (పట్టీ మార్చటం) చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే మానవత్వం మరిచి నొప్పి పెట్టేలా ఇష్టానుసారం వ్యవహరించటం మామూలుగా మారింది.