Telangana Congress Unemployement Protest Rally On Adaliabad: ఏడాదికి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. తెలంగాణ యువతను కేసీఆర్ నమ్మించి నట్టేట ముంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరగలేదని ఆరోపణలు చేశారు. ఆదిలాబాద్‌లోని నిర్వహించిన నిరుద్యోగ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
తెలంగాణ యువకులకు పేదరికం బాధలు ఏంటో తెలుసునని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఉద్యమంతో తెలంగాణను సాధించడం యువకులకు తెలుసునని వివరించారు. ఈ ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు మారు పేరు. ఆనాడు జల్- జమీన్- జంగిల్ నినాదంతో ఆదివాసీలు ఎంతో గొప్పగా పోరాడారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో తాగడానికి సాగు నీరు అందడం లేదని.. పొలాలకు సాగు నీరు అందడం లేదని.. యువతకు ఉద్యోగాలు లేవని ప్రత్యేక తెలంగాణ పోరాటాన్ని నినదించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే సాగిందని వివరించారు. కాని ప్రత్యేక రాష్ట్రం సంపాదించుకొని.. తొమ్మిదేళ్లు గడుస్తున్న ఇంకా వాటి గురించి పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Unemployement Protest Rally On Adaliabad: ఇలాంటి దుస్థితిని తీసుకు వచ్చిన ఈ సీఎం కేసీఆర్‌ను తెలంగాణ పొలిమేర్ల వరకు తరిమి తరిమి కొడదామని పిలుపునిచ్చారు. ఎక్కడా ఏ ఉద్యోగ నియామకం కూడా జరగలేదన్నారు. కేవలం కేసీఆర్ తన కుటుంబం, బంధువులకు మాత్రమే పదవులు ఇచ్చారు తప్ప.. ఇంకా ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర వచ్చిన తర్వాత ఏ ఒక్కరైనా బాగుపడ్డారు అంటే.. అది కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడిందని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదన్నారు. ప్రభుత్వం నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ వంటి ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయని.. ఎందుకు లీకవుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.