ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దస్నాపూర్ శివారు పరిధిలో సర్వే నంబర్ 21/1/ఏ, 21/1/డిలో మొత్తం 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మావల మండలంలో 1954 నుంచి అందుబాటులో ఉన్న కాస్రా పహానీ రెవెన్యూ రికార్డుల ఆధారంగా , 2018-19, 2019-20 పహానీల ఆధారంగా ఇప్పటికీ పడావు భూమిగానే ఉంది. ఇదే భూమి ప్రభుత్వం తమ పూర్వీకులకు కేటాయించిందంటూ 1994లో వారసులమని పేర్కొంటూ... ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించగా... 2005లో హద్దులు గుర్తించాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కానీ అదే ఏడాది అప్పటి యంత్రాంగం వారసులెవరూ లేరని కోర్టుకు అప్పీలు చేసింది. దాంతో 2005 లోనే హైకోర్టు డివిజన్ బెంచ్ వివాదాస్పదమైన ఆ 20 ఎకరాలను యధావిధిగా ఉంచాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఆస్థలం పడావుగానే ఉంది.
స్పందించిన అధికారులు
కానీ గత నెల 28, 31 తేదీల్లో కొంతమంది అక్రమంగా ఆ భూమికి పెన్సింగ్ చేయడమే కాకుండా ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేయడం వివాదస్పదమైంది. ప్రస్తుతం పలుకుతున్న మార్కెట్ ధరల ప్రకారం ఎకరా భూమి రూ. 5కోట్లను పరిగణలోకి తీసుకుంటే 20 ఎకరాలకు కలిపి రూ.100కోట్లు పలుకుతుండటంతో దానిపై కొంతమంది స్థిరాస్తి వ్యాపారుల కన్నుపడ్డ తీరును ఈటీవీ భారత్, ఈనాడులు ఎండగట్టాయి. స్పందించిన ఆర్డీవో రాజేశ్వర్ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని మావల తహసీల్దారు వనజారెడ్డిని ఆదేశించారు. ఈమేరకు ఆర్‌ఐ హన్మంత్‌రావు సారథ్యంలో సిబ్బంది వివాదస్పద స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. దీంతో ఆ స్థలంపై ఎవరి కన్ను పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సంబంధిత కథనం: 20ఎకరాల ప్రభుత్వ భూమిపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను