ఆదిలాబాద్ జిల్లాలో మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అక్రమాలపై ఈటీవీ-ఈటీవీ భారత్‌లో వచ్చిన వరుస కథనాలతో అప్రమత్తమైన అధికారులు అన్ని కోణాల్లో విచారణను చేస్తున్నారు. ప్రధానంగా నేరడిగొండ మండలంలో 31 మందికి, బోథ్ మండలంలో 30, గుడిహత్నూర్ మండలంలో 15, బజార్‌హత్నూర్ మండలంలో 32 మావల మండల పరిధిలో ముగ్గురికి... మొత్తం 111 మంది బినామీలకు... ఒక్కొక్కరికి లక్షా 116 చొప్పున కల్యాణలక్ష్మి చెక్కులు జారీ అయినట్లు తేల్చింది. కానీ ఇందులో మావల మండల పరిధిలో ముగ్గురికి, బోథ్ మండలంలో మరో 21 మందికి డబ్బులు ముట్టకపోవడం వల్ల 87 మంది బినామీలబ్ధిదారులని రెవెన్యూశాఖ నిర్ధరించింది. ఇచ్చోడ మీసేవ కేంద్రంలో జరిగిన ఈ అక్రమాల్లో జ్ఞానేశ్వర్, నిర్మల, సరస్వతీబాయి, దినేష్‌జాదవ్, జాదవ్ శ్రీనివాస్, మానే బాలక్రిష్ణ, మీసాల శంకర్, సాంగ్లే సునీల్, సిందే అశ్చుత్‌ను మధ్యదళారులుగా గుర్తించారు. వీరి నుంచి డబ్బులు రాబట్టేందుకు రెవెన్యూశాఖ ప్రయత్నిస్తోంది.
మరింత లోతుగా విచారణ
రెవెన్యూశాఖ గుర్తించిన తొమ్మిది మంది దళారులతోపాటు ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. ఉట్నూర్ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి పరిశోధనాధికారిగా అంతర్గత విచారణ కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా గతంలోనే ఆయా మండలాల తహసీల్దారులు జరిపిన బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరాతీయడం అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.