అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జలాశయాలు నిండుతున్నాయి. దాదాపు అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది.
30 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీరాంసాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం 2.04 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుతం 1,089.4 అడుగుల నీటిమట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం విలువ 90 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 81.69 టీఎంసీలు నిల్వ ఉంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు 30 గేట్లు ఎత్తి... 1,96,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం 15,480 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1403 అడుగులు ఉంది. నీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15 టీఎంసీలు సామర్థ్యం ఉంది. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
వరద నీరు వస్తే సమాచారం ఇవ్వాలి: డీసీపీ
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఎల్లంపల్లి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు 4.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... 4.3 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ప్రస్తుతం 18.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరదనీరు ఇళ్లల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని మంచిర్యాల డీసీపీ తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జంట జలాశయాల్లో..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. హిమాయత్‌సాగర్ జలాశయంలోకి 750 క్యూసెక్కులు నీరు వస్తోంది. గరిష్ఠ నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా.. జలాశయంలో ప్రస్తుతం 1,762.10 అడుగులకు నీరు చేరింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి... మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లోకి 1,200 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1,789.35 అడుగులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా మూసీలోకి 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
గోదావరి నీటిమట్టం పెరుగుతోంది...
గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు... ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అడవి ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. అప్రమత్తమైన అధికారులు 21 గేట్లు ఎత్తి 54,385 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 53,984 క్యూసెక్కుల నీరు వస్తుందని... వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని డీఈ తిరుపతి తెలిపారు.