తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైదీ వనం... జిల్లా జైలే ఓ సుందరవనం - latest news of adilabad district jail turns into a garden fileds

అడవిలో ఏపుగా పెరిగే టేకు వృక్షాలు... అరుదుగా కనిపించే చేపల చెరువులు... బంతి, చేమంతి పూల సాగు.. సేంద్రియ ఎరువుల వినియోగంతో... ఆరోగ్యానికి దోహదం చేసే తాజా కూరగాయలు... ఇవన్నీ ఒకే చోట లభిస్తే... ఎలా ఉంటుంది. ఇది సినిమా సెట్టింగ్‌లోనే సాధ్యమనుకుంటే పొరపాటే. వీటన్నింటికీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన ఆదిలాబాద్‌ జిల్లా కారాగారంపై "ఈటీవీ భారత్" అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఖైదీ వనం... జిల్లా జైలే ఓ సుందరవనం

By

Published : Nov 21, 2019, 6:00 AM IST

ఆదిలాబాద్‌ జిల్లా జైలు... ఖైదీల పరివర్తన కేంద్రంగానే కొనసాగుతోంది. దాదాపుగా 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కారాగారంలో సుమారు ఎనిమిది నుంచి పదెకరాల విస్తీర్ణంతో జైలు, అధికారుల భవన సముదాయం ఉంది. మిగిలిన దాంట్లో దాదాపుగా ఓ ఆరెకరాల భూమిలో వివిధ రకాల పంటలు పండిస్తుండటం వల్ల జైలు కాస్తా.... వ్యవసాయ క్షేత్రంలా కనిపిస్తోంది.

సూపరింటెండెంట్​ ఆలోచనే..

జైలు సూపరింటెండెంట్‌ శోభన్‌బాబు తనకు వచ్చిన ఆలోచనతో దాదాపుగా రెండెకరాల విస్తీర్ణంలో టేకు వృక్షాలు, మరో రెండున్నర ఎకరాల్లో కంది పంట, ఎకరం విస్తీర్ణంలో బంతి, చేమంతి, లిల్లీ, మరో అర ఎకరంలో డెకరేషన్లకు ఉపయోగించే గడ్డిసాగు, అర ఎకరంలో అధిక లాభాలను ఆర్జించే టమాట, మరో అర ఎకరంలో మిర్చి.... అంతర్‌ పంటలుగా మెంతి, పాలకూర, కొత్తిమీర, చుక్కకూర, మామిడి, యాపిల్‌, బేర్‌ యాపిల్, జామా, దానిమ్మ, సీతాఫలం సాగుచేస్తున్నారు. జైలు అధికారుల పర్యవేక్షణలో ఖైదీలే కర్షకులుగా కొనసాగుతున్న సాగు విధానం సత్ఫలితాన్నిస్తోంది.

శాస్త్రీయ సాగు

శాస్త్రీయవిధానానికి అనుగుణంగా పంట మార్పిడి పద్ధతిని పాటిస్తున్నారు. ప్రత్యేక నీటి వసతితో ఆధునిక సాగువిధానాన్ని అవలంభిస్తున్నారు. పావు ఎకరం విస్తీర్ణంతో చేపల చెరువును తవ్వి... ఆరువేల చేపపిల్లలను పెంచుతున్నారు. చేపలకు క్రమం తప్పకుండా ప్రత్యేక ఫీడింగ్ ఇస్తున్నారు.

తక్కువ కాలం 100 మందితోనే

జిల్లా జైలులో 140 మంది ఖైదీలుంటే... తక్కువకాలం శిక్షపడిన 100 మందితో వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. రసాయనిక ఎరువుల జోలికి వెళ్లకుండా... జైలు ఆవరణలోనే లభ్యమయ్యే ఆకులు, చెత్తా, చెదారంతో పాటు రాలిపడిన ఆకులతో తయారుచేసిన సేంద్రియ ఎరువులనే పంటలకు వినియోగిస్తున్నారు. జైలులో ఉంటూ మానసికంగా కుంగిపోకుండా ఉండేందుకు ఈ చర్య ఉపశమనం కలిగిస్తోందని ఖైదీలు అంటున్నారు. సొంత పొలాల్లో పని చేసినట్లుగా ఉందంటున్నారు.

ఇక్కడ పండిస్తున్న కూరగాయలను జైలు వంటకాల్లో వినియోగించడంతో పాటు రైతు బజార్‌లోనూ విక్రయిస్తున్నారు. ఖైదీల్లో ప్రవర్తన మార్పే లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఖైదీ వనం... జిల్లా జైలే ఓ సుందరవనం

ఇదీ చూడండి: మరింత అందంగా భాగ్యనగరం..

ABOUT THE AUTHOR

...view details