Pregnant and baby died: నేడో, రేపో లోకాన్ని చూడాల్సిన కడుపులోని బిడ్డ సహా నిండు గర్భిణీ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యకళాశాలలో చోటుచేసుకుంది. తెల్లవారుజామునే వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీకి సకాలంలో వైద్యం అందకపోవడంతో... ఆ కాసేపటికే కడుపులోని బిడ్డ సహా గర్భిణీ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన అక్షిత(23) తొమ్మిది నెలల గర్భవతి. ఇంట్లో ఉన్నప్పుడే తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో ఆశాకార్యకర్తకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా అక్షితకు మధ్యలోనే ఫిట్స్ వచ్చాయి. ఆందోళన చెందిన కుటుంబీకులు.. అతివేగంగా ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రికి వెళ్లాక తమ బిడ్డకు సకాలంలో వైద్యం అందలేదని.. మత్తు, గైనిక్ వైద్యులు అందుబాటులో లేరని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు. పురుటినొప్పులు భరించలేకనే కడుపులోని బిడ్డ సహా తమ కూతురు మృతిచెందిందని విలపించారు. దీంతో మృత దేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్రనాయకురాలు సుహాసినిరెడ్డి సంఘీభావం ప్రకటించారు.