తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగరంగ వైభవంగా ముగిసిన నాగోబా జాతర

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులతో జాతర ప్రాంగణం జనసంద్రంగా మారింది. చివరి రోజు కావడం వల్ల జాతరకు భక్తులు పోటెత్తారు. ఏటా ఆనవాయితీగా జరిగే ప్రజాదర్బార్‌ను ఈసారి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులకు ఆదివాసీలు తమ సమస్యలను విన్నవించుకున్నారు.

Praja darbar in Nagoba jathara
వైభవంగా ముగిసిన నాగోబా జాతర

By

Published : Jan 30, 2020, 5:57 AM IST


ఆదివాసీల సంప్రదాయ పండుగ నాగోబా జాతర ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో వైభవంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు. చివరిరోజు కావడం వల్ల ఆదివాసీలు సంప్రదాయబద్ధంగా డోలు వాయిస్తూ.. జాతరకు వచ్చారు.

ఆకట్టుకున్న నృత్యాలు..

ప్రజాదర్బార్‌ వద్ద ఆదివాసీలు చేసిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆనవాయితీ ప్రకారం నాగోబా జాతర వద్ద ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయంబాపురావు, జిల్లా అధికారులు హాజరయ్యారు.

నాలుగు రోజుల్లో రూ. 50 లక్షలు..

తొలుత నాగోబా దేవతకు పూజలు చేసిన మంత్రి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ పునర్‌నిర్మాణానికి 4 రోజుల్లో రూ. 50 లక్షలు విడుదల చేస్తామని.... మరో రూ. 50 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి సీఎం కట్టుబడి ఉన్నారని మంత్రి వెల్లడించారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వం సహకరించాలి..

అటవీ అధికారుల వల్ల ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ సోయం బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఆదివాసీలను ప్రశాంతంగా జీవించేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.

వైభవంగా ముగిసిన నాగోబా జాతర

ABOUT THE AUTHOR

...view details