ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా ఐసోలేషన్లపై ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశాలు ఏర్పాటుచేసి అత్యవసర వైద్యసేవలను మెరుగుపర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇంకా కార్యరూపం దాల్చడంలేదు. ఆదిలాబాద్ రిమ్స్, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ కేంద్రాల్లో ఐసోలేషన్ కేంద్రాల పరిధిలో దాదాపుగా 250 మంది కరోనా రోగులకు మెరుగైన స్థాయిలో చికిత్సలు అందడంలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా యంత్రాంగాన్ని ముందుండి నడిపించగల సమర్థ నాయకత్వం కొరవడింది.
కరవైన సమష్టి కృషి
మొదటి దశ కరోనా సమయంలో కలిసి పనిచేసిన సమష్టి కృషి ఇప్పుడు కనిపించడంలేదు. ఫలితంగా ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతోంది. రెండో దశ కరోనా ప్రారంభమైన తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా 350 మందికి పైనే మృత్యువాతపడితే అధికారికంగా ఈ సంఖ్య 200 దాటడం లేదు. ఇప్పటికీ వేల సంఖ్యలో క్రియాశీలక కేసులు నమోదవుతూనే ఉన్నప్పటికీ అధికారులు వెల్లడించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.
విమర్శల వెల్లువ
మే 12 నుంచి లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత టీకాల కార్యక్రమం ఆశించినట్లుగా ముందుకు సాగడంలేదు. మొదటి డోసు టీకాలైతే ఎవరికీ ఇవ్వడమే లేదు. రోజుకో విధంగా నిబంధనలను అమలుచేస్తుండటంతో ఏ కార్యక్రమం సజావుగా సాగడంలేదు. ఆదిలాబాద్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలనే సీఎం ఆదేశాలు ఆమలుకాలేదు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తాత్కాలిక పద్ధతిన అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బందిని భర్తీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. ఫలితంగా ప్రజల ప్రాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవడం లేదనే విమర్శలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.