ఆసుపత్రుల వద్ద ప్రత్యేక నిఘా
ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అడవుల్లోని కొంతమంది మావోయిస్టులు కరోనా బారినపడినట్లు పోలీసులకు సమాచారం ఉంది. మరికొంతమంది సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉండటంతో ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు పోలీసుశాఖ భావిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో వ్యూహాత్మకంగా వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసుశాఖ.. ఆసుపత్రుల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులకు అనుకూలమైన ఆసిఫాబాద్, చెన్నూరు, బోథ్, నిర్మల్, ఉట్నూర్‌లాంటి ప్రాంతాల్లోని ఆసుపత్రులనే కాకుండా మెడికల్ దుకాణాల వద్ద కూడా కొత్త వ్యక్తుల కదలికలను ఆరాతీసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే ఆసిఫాబాద్ ఇంఛార్జీ ఎస్పీగా ఉన్న రామగుండం సీపీ సత్యనారాయణ సహా మంచిర్యాల పోలీసు అధికారుల ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
కూంబింగ్ ముమ్మరం
ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంతో పాటు ఆసిఫాబాద్, బెజ్జూరు, కెరమెరి, కౌటాల, వాంకిడి, ఉట్నూర్, సారంగపూర్, కడెం, బోథ్, బజార్‌హత్నూర్ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల కిందటనే ఒక్కో ప్రాంతానికి రెండేసి పోలీసు ప్లాటూన్లను రంగంలోకి దించడం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని వెల్లడిస్తోంది. కొంతమంది ఎస్‌ఐబీ అధికారులు సైతం సాధారణ వ్యక్తుల్లాగా సంచరిస్తూ వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టులు సైతం మాస్కులు దరిస్తూ... జనాల్లో సంచరిస్తున్నారనే సమాచారమే పోలీసుశాఖను అప్రమత్తం చేస్తోంది.