తెలంగాణ-మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తోన్న పెన్‌గంగా నీటిని ఒడిసి పట్టి ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని పంట చేలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పిప్పలకోటి గ్రామ శివారులో మరో జలాశయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 368 కోట్ల నిధులను మంజూరు చేసింది. చనకా కోరాట బ్యారేజికి అనుసంధానంగా హత్తిఘాట్ వద్ద పంపు హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి పిప్పలకోటి జలాశయానికి నీటిని మళ్లించాలని నిర్ణయించారు. ఈమేరకు 1024.10 ఎకరాలు అవసరమని భావించి మేరకు అధికారులు భూ సేకరణ పూర్తి చేశారు. మెజార్టీ రైతులకు ప్రయోజనం కలుగుతుందనే భావనతో నిర్వాసితులకు అధికారులు ఎకరానికి 8 లక్షలు ఇస్తామంటే ఒప్పుకుని అన్నదాతలు భూములు అప్పగించారు.
పరిహారం ఇవ్వండి..
బ్యారేజీ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఏడాది కిందట అప్పగించిన భూములకు ఇప్పటికీ పరిహారం రాకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పరిహారం ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
పరిహారం ఇప్పించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తున్నారని భాజాపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. బాధిత రైతులతో కలిసి బ్యారేజి స్థలాన్ని ఆయన సందర్శించారు.