ఆదిలాబాద్ జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం పంపిణీ చేసిన శనగల(Peas)కు చెదలు పట్టాయి. కోట్లాది రూపాయల విలువచేసే శనగల్లో ఒక్క గింజ తినరాకుండా పోయింది. కరోనా సమయంలో వలసకార్మికుల ఆకలి తీర్చే ఉద్దేశంతో జిల్లాలోని 110 చౌకధరల దుకాణాలకు 52వేల 210 కిలోల బియ్యం, 6వేల 460 కిలోల శనగలను విడుదల చేసింది. ప్రతి కార్మికునికి రెండు కిలోల చొప్పున బియ్యం, కిలో చొప్పున శనగలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.
ముక్కిపోతున్న వైనం...
ఇందులో భాగంగా గోడౌన్ల నుంచి పౌరసరఫరాశాఖ యంత్రాంగం... ఆగమేఘాలమీద సరకులను చౌకధరల దుకాణాలకు తరలించింది. కానీ ఏడాదిన్నర గడుస్తున్నా నేటికీ మార్గదర్శకాలు విడుదల కాలేదు. పంపిణీ చేసిన శనగలు ముక్కిపోయి... పురుగులతో చెదలు పట్టి చౌకధరల దుకాణాల్లో మక్కిపోతున్న వైనం 'ఈటీవీ-ఈటీవీభారత్-ఈనాడు' పరిశోధనలో బయటపడింది. అంటే నిరుపేదల ఆకలి బాధకు అధికారులు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో ఈ ఘటన ద్వారా రుజువవుతోంది.
పట్టించుకునేవారేరి...
జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లోని 4 దుకాణాలకు పంపిణీ చేసిన దాదాపుగా 2వేల క్వింటాళ్ల శనగలు పంపిణీ చేయక మూలనపడేయడంతో పురుగుపట్టింది. పైగా బియ్యం నిలువలను పంపిణీ చేయడం లేదంటూ లబ్ధిదారులు తమతో గొడవలకు దిగుతున్నారనే రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది డీలర్లు సమస్యను పైఅధికారుల దృష్టికి తీసుకొచ్చినా... ఎవరూ పట్టించుకోకపోవడం బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిచేస్తోంది.