ఆదిలాలాబాద్ జిల్లాకు ఆరోగ్య సంజీవినిగా పేరొందిన రిమ్స్ వైద్య కళాశాలలో భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం... అన్ని విభాగాల్లో కలిపి కనీసం 300మంది వైద్యులుండాలి. కానీ ప్రస్తుతం అక్కడ 100మంది వైద్యులు కూడా లేరు. 2008 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన రిమ్స్‌లో ఇప్పటికీ ఎంఆర్‌ఐ పరీక్షలు చేయించుకోవడానికి కూడా సదుపాయాలు లేవు. చిన్నచితకా వ్యాధులకు కూడా ప్రైవేటు ఆస్పత్రులు, లేదంటే.. హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగపూర్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో కనీస వసతులు లేక జిల్లాలో ఇప్పటివరకు 31 మంది కన్నుమూశారు.
మంజూరైనా.. ఖాళీగానే!
జిల్లా ఆస్పత్రి విషయం ఇలా ఉంటే.. వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అదే పరిస్థితి. జిల్లాలో మొత్తం 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గాను ప్రభుత్వం 62 మెడికల్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తే విధుల్లో 48 మందే ఉన్నారు. మరో 14 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. అక్కడ ఉన్నవే రెండు హెడ్ నర్సుల పోస్టులు. అవి కూడా మంజూరయ్యాయి కానీ.. భర్తీ కాలేదు. సివిల్ అసిస్టెంట్ వైద్యులు ఆరుగురు ఉండాలి. కానీ.. ఒక్కరే ఉన్నారు. క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైన రెండో ఏఎన్‌ఎం పోస్టులు 13 ఖాళీగా ఉంటే... మహిళా హెల్త్ అసిస్టెంట్ పోస్టులు 31 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లేక, సిబ్బంది లేక... ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లు వసూలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.