ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ బాధితులు పెరుగుతున్నా సౌకర్యాలు మెరుగుపడటం లేదు. కరోనా అనుమానంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు వెంటిలేటర్, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా వైద్యుల కోసం రోజుల కొద్దీ నిరీక్షిస్తున్నారు. రిమ్స్ ఆస్పత్రితోపాటు ఆసిఫాబాద్, నిర్మల్, బెల్లంపల్లి కేంద్రాలుగా ప్రభుత్వం వెంటిలేటర్ మంచాలను ఏర్పాటుచేసింది. రిమ్స్‌లో 110 వెంటిలేటర్ పడకలను ఏర్పాటు చేసినట్లు అధికారికంగా చెపుతున్నప్పటికీ.. దానికి తగినట్లుగా వైద్యనిపుణులు, సిబ్బంది లేకపోవడంతో రోగులకు ప్రాణసంకటంగా మారుతోంది. రిమ్స్‌లో మొత్తం 120 మంది వైద్యులు పనిచేస్తుంటే అందులో రెగ్యులర్ వైద్యులు 15 మందికి మించిలేరు.
వేధిస్తున్న వైద్యుల కొరత..
కొవిడ్ బాధితులను పర్యవేక్షించడానికి ఊపరితిత్తుల నిపుణులు, అనస్తీషియన్లు లేరు. కేవలం ఏడుగురు సాధారణ ఫిజీషయన్ల నేతృత్వంలోనే వైద్యం సాగుతోంది. ఫలితంగా వెంటిలేటర్ సౌకర్యం ఉందని సంబరమే తప్ప.. ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. ఆసిఫాబాద్ కేంద్రంగా రెండే వెంటిలేటర్ పడకలు ఏర్పాటు చేయడంతో కొవిడ్ బాధితులకు రిమ్స్, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేసే పరిస్థితి నెలకొంది.